వరంగల్: వరంగల్ పండ్ల మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలో గల ముసలమ్మ కుంటలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రైతు సంక్షేమ ప్రభుత్వం ప్రతీ అన్నదాత అభివృద్ధి, సంక్షేమం కోసమే కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే వరంగల్ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ(ఆర్గానిక్)పద్ధతిలో సాగు చేసే పండ్లను విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు రావాలన్నారు. మామిడి మార్కెట్‌లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులతో మార్కెట్ రోడ్డు అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌నాగరాజు మాట్లాడుతూ మార్కెట్‌లో టాయిలెట్లు నిర్మాణానికి నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఫ్రూట్ మర్చంట్ అసోసియే షన్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, అనిల్‌కుమార్, స్థానిక నాయకుడు ఇంతియాజ్, ప్రజాప్రతినిధులు, ట్రేడర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి..
మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ దేశాయిపేటలో దుర్గాబాయి మహిళాశిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభించారు. 9,462 స్వయం సహాయక బృందాలకు రూ.20 కోట్ల 84 లక్షల 73 వేల బ్యాంక్ లింకేజీ చెక్‌ను అందజేశారు. అనంతరం వరంగల్, ఖిలావరంగల్ మండలాల పరిధిలోని 457మంది కుటుంబాలకు రూ. 4 కోట్ల 87 లక్షల 56 వేల 492 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగారాజు, కలెక్టర్ సత్యశారద అందజేశారు.
రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
ముసలమ్మకుంటలో మామిడి మార్కెట్ ప్రారంభం
మామిడి క్వింటా రూ.11.220
వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంటలో ఏర్పాటు చేసిన మామిడి మార్కెట్‌లో గురువారం తొలిసారి పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో టన్ను మామిడి గరిష్టంగా రూ.లక్షా 22వేల ధర పలింది. క్వింటాకు రూ.11,220కి కొనుగోలు చేశారు.