
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులవైపు చూపు
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన భారీ బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలు పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లవైపు ఆశలు ఉన్నట్లు కనిపిస్తోంది. సొంత ఆదాయం రూ.32 శాతం కాగా.. ప్రభుత్వాల గ్రాంట్లే 68 శాతంగా అంచనా వేశారు. గురువారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్‌హాల్‌లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.1,071.48 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సభ ముందుంచారు. బల్దియా జేఏఓ సరిత పద్దులను చదివి వినిపించారు. బడ్జెట్‌పై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్ రావు, చాడ స్వాతి సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని, భవన నిర్మాణాల ఆక్రమణలు, కమర్షియల్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, నాన్ లే అవుట్ల క్రమబద్ధీరణ చేయాలని కోరారు. ఆ తర్వాత బల్దియా బడ్జెట్‌ను ‘మమ’అనిపించారు. 30వ డివిజన్‌లో సీసీరోడ్లు నిర్మించిన వారానికే పగుళ్లు పట్టాయని బీజేపీ కార్పొరేటర్లు కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఏకుల కోర్నేలు మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. గంటా ఇరవై నిమిషాల పాటు బడ్జెట్ సమావేశం కొనసాగింది.
అంచనాలు ఘనం.. ఆచరణలో సాధ్యమేనా?
బల్దియా ప్రతీ ఏడాది వేసుకున్న ఆదాయ, వ్యయ అంచనాలను అందుకోవడంలో తలకిందులవుతోంది. అయినా.. తదుపరి ఏడాదికి ఇంకా పెంచి లెక్కలు వేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార యంత్రాంగం సొంత ఆదాయాన్ని కేటాయింపుల్లో 60 శాతం వసూళ్లు దాటడం లేదు. గతేడాది రూ.650.12 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి, తదుపరి రివైజ్డ్ బడ్జెట్ రూ.776.20 కోట్లుగా మార్చేశారు. అందులో సొంత ఆదాయం తొలుత రూ.237 కోట్లు చూపించి, తదుపరి రూ.383 కోట్లుగా అంచనాలు రూపకల్పన చేశారు. ఈ ఏడాది రూ.274 కోట్లను జోడించి ఈ దఫా బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ గ్రాంట్లపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడంతోనే అంకెలు పైకి ఎగబాకినట్లుగా స్పష్టమవుతోంది. గతేడాది బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రధానంగా ప్రభుత్వాల నుంచి రూ.410 కోట్లను ఆశించగా కేవలం రూ.200 కోట్ల మేరకు నిధులు బల్దియా ఖజానాకు చేరాయి. ఇకపోతే గత బడ్జెట్ కంటే రెవెన్యూ తగ్గించినట్లుగా చూపించి, మరోవైపు ఆస్తి పన్నులు, భవన నిర్మాణాల ఫీజులను కొంత మేరకు పెంచారు. గతేడాది ఆస్తి పన్ను ద్వారా రూ.87.93 కోట్లు వస్తాయని అంచనా వేశారు కానీ ఇప్పటి వరకు 60 శాతం కూడా వసూలు చేయలేకపోయారు. ఇలా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలకు వివిధ రూపాల్లో రావాల్సిన రెవెన్యూ వసూలు చేయడంలో బల్దియా అధికార యంత్రాంగం చతికిలపడుతోంది. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వానా శమీమ్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,071.48 కోట్లతో గ్రేటర్ వరంగల్ బడ్జెట్
సొంత ఆదాయం రూ.337.38 కోట్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.728.10 కోట్లు
కేటాయింపులు చదివి వినిపించిన జేఏఓ సరిత
మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం
హాజరైన మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు
ఇద్దరితోనే మాట్లాడించి మమ.. అనిపించిన పాలకవర్గం
సీసీ రోడ్ల పగుళ్లపై బీజేపీ సభ్యుల ప్లకార్డుల ప్రదర్శన