ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా..! ఇక అంతే సంగతులు..!!

- - Sakshi

వరంగల్‌: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌పై అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. షోరూంలలో కనిపించని వస్తువులు అనేకం ఆన్‌లైన్‌ షాపింగ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే నెట్‌లో కనిపించే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రకటనలన్నీ నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రచారంలో చెప్పేదొకటి.. ఆర్డర్‌ ఇవ్వగానే డెలివరీ అయ్యేది మరోటి. పైగా ధరల్లో తేడాలు.

దీని గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో చాలా తక్కువ ధరలకే వివిధ రకాల ఉత్పత్తులను లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్‌, రెడీమేడ్స్‌, లేడీస్‌ యాక్సెసరీస్‌, కాస్మోటిక్స్‌, స్మార్ట్‌ఫోన్‌లు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్డర్‌ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయా కంపెనీలు వాటిని ఇంటికే నేరుగా సరఫరా చేస్తాయి.

ఇంట్లో కూర్చోనే కావాల్సిన వస్తువులను హాయిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చూడడానికి, వినడానికి ఇది ఎంతో బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డర్‌ ఇచ్చిన వస్తువులు ఇంటికి రాగానే వాటిని చూసి అవాకై ్కపోతున్న వారు అధిక శాతం మంది ఉన్నారు.

ఆకర్షణలకు లొంగొద్దు..
ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చే కంపెనీల్లో నమ్మకమైనవే కాకుండా కొన్ని బోగస్‌ కంపెనీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక స్మార్ట్‌ఫోన్‌కు ధర చెల్లిస్తే ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెప్పారు. తీరా ఆర్డర్‌ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్యాక్‌ను తెరిస్తే బొమ్మ ఫోన్‌ లేదా రాళ్లు నింపి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి.

అలాగే రెడీమేడ్‌ వస్తువులు ఆర్డర్‌ ఇస్తే నాసిరకం ఉత్పత్తులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా వారిచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేసినా ఫలితం ఉండదు. దీంతో తాము మోసపోయమని గ్రహించిన పట్టించుకునే వారు ఉండరు. అందుకే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని ఉండడం మంచిది.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు..
► సదరు కంపెనీ ఎలాంటి ఉత్పత్తులపై వ్యాపారం చేస్తుందో గమనించాలి.
► కంపెనీకి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవాలి.
► ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువులు, షాపింగ్‌ మాల్స్‌లో లభించే వస్తువుల ధరల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో గమనించాలి.
► ఆయా ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్స్‌, వివిధ రకాల ఆఫర్ల గుర్తించి అవగాహన ఉండాలి.
► బోగస్‌ కంపెనీల గురించి తరచూ పత్రికల్లోకానీ, పోలీసులు చెబుతుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండాలి.
► ఆన్‌లైన్‌ మోసాలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్‌ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
► ఎప్పుడైనా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే సైబర్‌ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు.
► ఆన్‌లైన్‌ కంపెనీలకు సంబంధించిన ఫోన్‌ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. వాటి అడ్రస్‌ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే సదరు నంబరుకు ఫోన్‌ చేయాలి.
► ఆన్‌లైన్‌లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్‌పై కంపెనీల చిరునామా, ఎప్పుడు తయారయ్యాయే? గమనించడంవంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లను నమ్మితే ఇక అంతే..
డిస్కౌంట్లు.. డిస్కౌంట్లు. అప్‌టు 50 పర్సంట్‌, 75 పర్సంట్‌ వరకు తగ్గింపు.. ఒక వస్తువు కొంటే మరోటి ఫ్రీ.. పైగా ఉచిత డోర్‌ డెలివరీ.. ఇలా ఒకటేమిటి ఆన్‌లైన్‌ షాపింగ్‌లో అన్నీ ఇలాంటి ఆఫర్లే దర్శనమిస్తాయి. బోగస్‌ ప్రకటనలెన్నో. ఇందులో కొన్ని నిజం కూడా కావొచ్చు.. అయితే ఉద్యోగాలు, ఇంటి పనులతో సమయం చిక్కని వారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరమే. కానీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తగిన సూచనలు పాటిస్తూ, విచక్షణ ఉపయోగించి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కంపెనీల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి
ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి ప్రకటన నిజమేననే భ్రమ వీడాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు ఆయా కంపెనీలకు ఉన్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడు మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. –సార్ల రాజు సీఐ, కాజీపేట

Read latest Hanamkonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top