
హన్మకొండ చౌరస్తా: జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తానంటూ మంగళవారం కాజీపేటలో రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాయిని తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘పక్క జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నా జిల్లాలో పాదయాత్ర చేయడానికి రాఘవరెడ్డి ఎవరు? కాంగ్రెస్ శ్రేణులను గ్రూపులుగా తయారుచేసి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇతర జిల్లాలో పార్టీ కార్యక్రమాలు చేపట్టద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అయినప్పటికీ క్రమశిక్షణను ఉల్లంఘించి జనగామ జిల్లాను వదిలేసి హనుమకొండ జిల్లాలో పర్యటించడం సరైంది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్న జంగా రాఘవరెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయాలంటూ ఆధారాలతో ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు, టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు.