అవినీతి అధికారులపై కొరడా! | - | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారులపై కొరడా!

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

అవినీతి అధికారులపై కొరడా! గుంటూరు టౌన్‌ ప్లానింగ్‌ అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు

2011–12 నుంచి 2013–14 వరకు జీఎంసీలో అక్రమాల పరంపర ‘సాక్షి’ కథనంపై స్పందించిన సర్కారు మొత్తం 32 మందిపై చర్యలకు సిద్ధం నాడు నకిలీ చలానాల దోపిడీ, నేడు కీలక పోస్టుల్లో తిష్ట వేసిన వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రస్తుత కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ నివేదికతో కదిలిన పురపాలక శాఖ

‘సాక్షి’ కథనంతో కదలిక

గుంటూరు టౌన్‌ ప్లానింగ్‌ అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. 2011–12 నుంచి 2013–14 మధ్య కాలంలో కార్పొరేషన్‌ ఖజానాకు భారీ నష్టం కలిగించిన వ్యవహారంలో అప్పట్లో నగర పాలక సంస్థలో పనిచేసిన కమిషనర్లు, సిటీ ప్లానర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు, ఏసీపీలు, ఇతర సిబ్బంది మొత్తం 32 మందిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో 19 మంది విధుల్లో ఉండగా 13 మంది రిటైర్‌ అయ్యారు. విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులపై ఉమ్మడి క్రమశిక్షణా చర్యలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వ పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ తాజాగా జీఓ జారీ చేశారు.

కమిషనర్‌ నివేదిక.. ప్రభుత్వ ఉత్తర్వులు

ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత జీఎంసీ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిని సీడీఎంఏ ప్రభుత్వానికి ఫార్వర్డ్‌ చేయగా, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ అభ్యంతరాలు, వివిధ విచారణ కమిటీల నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ (సీసీఏ) నిబంధనలు ప్రకారం 32 మందిపై ఉమ్మడి విచారణ పూర్తి చేసి తగిన శిక్షలు విధించే అధికారం ప్రభుత్వానికే ఉంటుందని జీఓలో స్పష్టం చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వీరే..!

అప్పటి సిటీ ప్లానర్‌ కె.ధనుంజయ రెడ్డి (ప్రస్తుతం జీవీఎంసీ సిటీ ప్లానర్‌/జేడీటీపీ), అప్పటి అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు కె.సంజయ్‌ రత్నకుమార్‌ (జేడీటీపీ, విశాఖపట్నం), ఎన్‌.సురేఖ (డీడీటీపీ/పీఓ, ఏలూరు)తో పాటు, ప్రస్తుతం ఏపీసీఆర్‌డీఏ (విజయవాడ), జీవీఎంసీ, పొన్నూరు, పిడుగురాళ్ల, తాడిగడప, నూజివీడు, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో టీపీవో/టీపీఎస్‌లుగా పనిచేస్తున్న సిహెచ్‌. భవాని, సిహెచ్‌ వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌.స్రవంతి, వి.వాణి, డి.వి.రఘురామ్‌, బి.హృదయ రాజు, కె.శ్రీనివాస రావు, కె.వెంకటేశ్వర రావు, షేక్‌ రిజ్వానాలతో పాటు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌పై ఉమ్మడి విచారణ జరగనుంది.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరిగిన అక్రమాలపై, నిందితులకు కీలక పోస్టులు కట్టబెట్టడంపై ‘సాక్షి’ దినపత్రికలో ఆగస్టు 19, 2026న ‘అక్రమార్కులకే కీలక పోస్టు’ అనే కథనం ప్రచురితమైంది. నకిలీ బ్యాంకు రబ్బర్‌ స్టాంపులు, నకిలీ చలానాలు సష్టించి రూ. 68.65 లక్షలు కాజేసిన వ్యవహారంలో లోకాయుక్త ఆదేశాలను సైతం బేఖాతరు చేశారని, నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాల్సింది పోయి, బదిలీల్లో వారికి అకౌంట్స్‌, రెవెన్యూ వంటి కీలక విభాగాల్లో అందలం ఎక్కించారని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement