తెనాలి తేజం..సినిమాలే వేదం | - | Sakshi
Sakshi News home page

తెనాలి తేజం..సినిమాలే వేదం

Nov 20 2026 2:12 AM | Updated on Nov 20 2026 2:12 AM

● ఆ విజయానందంలో ఉన్న వేదవ్యాస్‌, తన గురువు సురేంద్రరెడ్డి కారణంగానే అవకాశం వచ్చిందని, తొలి సినిమా సక్సెస్‌ కావటానికి మించిన ఆనందం ఏముంటుందని ‘సాక్షి’తో అన్నారు. నిర్మాత బాగుంటే సినిమా బాగుంటుందని, అప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ క్షేమంగా ఉంటారనేది తన అభిప్రాయంగా చెప్పారు. అంతేకాదు సుమా...చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగి, అందరిచేత చీవాట్లు తిన్న వేదవ్యాస్‌, ఇప్పుడు సురేంద్రరెడ్డితో కలిసి ఏటా మహాశివరాత్రి పర్వదినాన, కాశీ పుణ్యక్షేత్రంలో గడుపుతున్నారు. తన శరీరంపైన నాలుగైదు చోట్ల మంత్రాలతో కూడిన పచ్చబొట్లున్నాయి. తన సక్సెస్‌ అమ్మవారి దయవల్లేనని చెబుతున్నారు. తెలుగు సినిమాలో ఉద్దంఢులైన తెనాలి వారసుడిగా వేదవ్యాస్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం...

తొలి సినిమాతోనే హిట్‌కొట్టిన దర్శకుడు వేదవ్యాస్‌ అప్రతిహతంగా దూసుకుపోతున్న జి.ఒ.ఎ.టి. సినిమా ‘తిమ్మరుసు’ డైలాగ్‌ రైటర్‌గా సినిమా ప్రయాణం

సినిమా హాల్లోనే వీడ్కోలు ఫంక్షన్‌

తెనాలి: సినిమా దర్శకత్వంలో తెనాలి తేజం వెలిగింది. తొలి సినిమా ‘జి.ఒ.ఎ.టి’ హిట్‌ కొట్టాడు. చిన్నతనం నుంచి సినిమాపై గల ప్యాషన్‌తో ఈ రంగంలోకి డైలాగ్‌ రైటర్‌గా వచ్చిన యువకుడు ‘తిమ్మరుసు’తో చక్కని సంభాషణల రచయితగా క్రెడిట్‌ సాధించాడు. మళ్లీ ఇప్పుడు ‘స్టార్ట్‌..కెమెరా రోల్‌..యాక్షన్‌’ అంటూ దర్శకుడయ్యాడు. అరంగేట్రంతోనే నిరూపించుకున్నాడు. ఈనెల 12న విడుదలైన ‘జి.ఒ.ఎ.టి’ సినిమా విజయయాత్ర ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుని, తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఆ దర్శకుడు వేదవ్యాస్‌.. కళల తెనాలి బిడ్డ. తండ్రి శ్రీనివాస్‌ రైస్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌ వ్యాపారం. తల్లి సునీత గృహిణి. అక్క చాందిని దంత వైద్యురాలు. చెల్లెలు లోహిత ఎంఫార్మశీ పూర్తిచేసి, ప్రస్తుతం పీహెచ్‌డీలో ఉన్నారు. వేదవ్యాస్‌ ఫార్మశీ విద్యలో ఆరేళ్ల ఫార్మా–డి వచ్చిన తొలి బ్యాచ్‌ స్టూడెంట్‌. హైదరాబాద్‌లోని విమలారెడ్డి కాలేజీలో చదివారు. చదువుతూనే తన సినిమా కలను సాకారం చేసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. 2016లో చదువైపోగానే తెలుగు సినిమా ప్రపంచానికి కేరాఫ్‌ అయిన కృష్ణనగర్‌లో రూము తీసుకున్నారు. సినిమానే జీవితం అని దృఢంగా నిశ్చయించుకున్నారు. 2021లో సత్యదేవ్‌ హీరోగా వచ్చిన తిమ్మరుసు సినిమాతో సంభాషణల రచయితగా, మళ్లీ ఇప్పుడు 2026లో సుడిగాలి సుధీర్‌, తమిళ హీరోయిన్‌ దివ్యభారతిలతో తీసిన ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో దర్శకుడయ్యారు.

బాల్యం నుంచే సినిమాలపై పిచ్చి

తల్లిదండ్రులు తనకా పేరు పెట్టటం ఏమిటోగానీ, చిన్నతనంనుంచీ అందరిచేత చీవాట్లు తింటూ పెరిగానని వేదవ్యాస్‌ చెప్పారు. ‘బాల్యంలో జేబులో అగ్గిపెట్టెతో తిరిగేవాణ్ణి...ఎక్కడ చెత్త కనిపించినా అగ్గిపుల్ల గీసి వెలిగించేవాడిని...అలాంటి అల్లరి పనులు చూసి, ‘మీనాన్న అంత మంచి పేరు పెడితే నువ్వేందిరా ఇలా చేస్తున్నావు’ అంటూ అందరూ తిట్టేవారు. కొడుకు వీరంగం చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు ఇలా కాదనుకుని, గుంటూరులో భాష్యం స్కూలులో చేర్పించి, హాస్టల్లో పడేశారు. అక్కడ సందు దొరికినపుడల్లా ఇంగ్లిష్‌ సినిమాలు చూడటం, హాస్టల్లో రూమ్మేట్స్‌కు తెలుగులో చెబుతుండేవాడు. అలా సినిమా కథ చెప్పటం అలవాటైంది అంటారు వేదవ్యాస్‌. ఇంటర్‌ విజయవాడలోని శ్రీచైతన్యలో చేర్చించారు. అక్కడా హాస్టలే. పక్కనే సినిమాహాలు. గోడ దాటితే సినిమా. అలా రహస్యంగా గోడ దూకి సినిమాలకు వెళుతుండే వేదవ్యాస్‌ కాలేజి వైస్‌ ప్రిన్సిపాల్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. ఒకరోజు సినిమా చూసి రహస్యంగా గోడ ఎక్కిలోపలకు వద్దామని చూస్తుంటే, అక్కడే కాపలా ఉన్న వైస్‌ ప్రిన్సిపాల్‌, ‘గోడ దూకి పెంకుల మధ్య ఎందుకు...మెయిన్‌గేటు నుంచే రారా’ అన్నారట! అప్పట్లో కాలేజీ నుంచి పదిరోజులు సస్పెండ్‌ కూడా చేశారు.

మలుపు తిప్పిన సురేంద్రరెడ్డితో పరిచయం

కాలేజీలో ఉన్నప్పుడు అక్కడి స్టూడెంట్స్‌తోనే మూడు షార్ట్‌ ఫిల్మ్‌స్‌ తీసిన వేదవ్యాస్‌, చదువయ్యాక కృష్ణనగర్‌లో మకాంపెట్టాడు. అక్కడ్నుంచి సినిమా కష్టాలు తప్పలేదు. తాను తీసిన షార్ట్‌ ఫిల్మ్‌స్‌ చూపుతూ ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ వచ్చాడు. అదృష్టవశాత్తు ప్రముఖ సినీదర్శకుడు సురేంద్రరెడ్డితో కలిసే అవకాశం దొరికింది. ఇక ఆయనతోనే సినిమా ప్రయాణం మొదలుపెట్టారు. ‘తిమ్మరుసు’ సినిమా డైలాగ్‌ రైటర్‌గా పేరు తెచ్చుకున్నారు. హాట్‌స్టార్‌లో వచ్చిన ‘విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ’ పైలెట్‌ ఎపిసోడ్లకు తానే దర్శకులు. సురేంద్రరెడ్డి స్నేహితుడు మోగుల్ల చంద్రశేఖరరెడ్డి జి.ఒ.ఎ.టి సినిమా నిర్మాత. ఆయన సినిమాకు సమస్య ఏర్పడితే, సురేంద్రరెడ్డి సూచనతో వేదవ్యాస్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్‌ దక్కింది. సుడిగాలి సుధీర్‌, తమిళంలో బ్యాచిలర్‌ సినిమా ఫేమ్‌ హీరోయిన దివ్యభారతి, బ్రహ్మాజీ, చమక్‌ చంద్ర వంటి నటీనటులతో తీసిన సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

సినిమా మోజున్నా, చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఫార్మా–డీలో చేరాలని అన్నప్పుడు, సినిమా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో చేరతానని పట్టుబట్టితే, పెద్దలు సరేనన్నారు. అలా ఫార్మా–డీ చదువుతూ కృష్ణనగర్‌ వెళ్లి ప్రయత్నం చేద్దామంటే, కాలేజికి అక్కడకు గంటన్నర ప్రయాణం. ‘నాన్న కావాలనే నన్ను ఇంత దూరంలో చేర్చారు’ అనుకున్నాడు. కోర్సు పూర్తయ్యాక, మల్లారెడ్డి కాలేజిలో ఇంటర్న్‌షిప్‌ చేశారు. మనోడి సినిమా పిచ్చి కాలేజీ మొత్తం తెలిసిపోయింది. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక వేదవ్యాస్‌ వీడ్కోలు ఫంక్షనుకు మిత్రులంతా ఏకంగా ఒక సినిమా థియేటరులో శ్లాట్‌ తీసుకుని సంబరాలు జరుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement