ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ తారకనాథ్ గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే, వైట్ కోట్ వేడుకలు
గుంటూరు మెడికల్: ప్రతిష్టాత్మక గుంటూరు వైద్య కళాశాలలో గురువారం 2026 బ్యాచ్ నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే, వైట్ కోట్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ తారకనాథ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వైద్య విద్యార్థులకు వైట్ కోట్లు ధరింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, సమాజంలో వైద్యులకు విశిష్టమైన స్థానం ఉందని వివరించారు. వైద్యుడికి వైద్య పరిజ్ఞానంతో పాటు మానవత్వం, సహనం, కరుణ, సేవాభావం ఎంతో అవసరమని సూచించారు. రోగులకు చికిత్స అందించడమే కాకుండా వారిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించడం కూడా వైద్యుల బాధ్యత అన్నారు. వైద్యుడి చేతుల్లో నైపుణ్యం, మాటల్లో భరోసా, హృదయంలో మానవత్వం ఉండాలని చెప్పారు. తన సుదీర్ఘ వైద్య అనుభవంతో వైద్య వృత్తి గొప్పతనాన్ని, రోగులతో వైద్యులు అనుసరించాల్సిన నైతిక విలువలను వివరించి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.వి.వి.సుందరాచారి మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల దేశానికి ఎంతోమంది ప్రముఖ వైద్యులను అందించిందని వివరించారు. అటువంటి ప్రతిష్టాత్మక కళాశాలలో విద్యనభ్యసించడం విద్యార్థులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. వైట్ కోట్ అనేది కేవలం వస్త్రం కాదని, అది వైద్య వృత్తిపై నిబద్ధతకు, క్రమశిక్షణకు, నైతిక విలువలకు, రోగులపై బాధ్యతకు ప్రతీక అని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వైద్య విద్యలో నాణ్యతతో పాటు మానవతా విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీధర్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి పాల్గొని నూతన ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి అవసరమైన వైట్ కోట్లను గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అందించింది. నూతన విద్యార్థులు వైట్ కోట్లు ధరించడంతో కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వైద్యులు, సీనియర్ విద్యార్థులు, నూతన ఎంబీబీఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


