పేద రోగులేగా పోతే..పోనీ! | - | Sakshi
Sakshi News home page

పేద రోగులేగా పోతే..పోనీ!

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

జీజీహెచ్‌లో కిడ్నీ ఆపరేషన్లకు గ్రహణం ● గుంటూరు జీజీహెచ్‌కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కోసం ఏపీలోని అన్ని జిల్లాలలకు చెందిన కిడ్నీ రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో నిలిచిపోయిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు తిరిగి ప్రారంభించేలా చేసి పేద, మధ్య తరగతి రోగులకు భరోసా కల్పించాలని పలువురు కోరుతున్నారు.

ప్రైవేటులో ప్రతినెలా 15కు పైగా ఆపరేషన్లు

మూడేళ్లుగా నిలిచిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు

ఆస్పత్రి వైద్యుల సమన్వయ లోపమేఅసలు కారణం

పేద రోగుల ప్రాణాలపై అత్యంత నిర్లక్ష్యం

డయాలసిస్‌ చేయించుకుంటూ కిడ్నీ ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న పేద రోగులు

గతంలో విజయవంతంగా 24 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు

జీజీహెచ్‌లో కిడ్నీ ఆపరేషన్లకు గ్రహణం

గుంటూరు మెడికల్‌: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సి.హెచ్‌.సందీప్‌ కిడ్నీ జబ్బుతో బాధపడుతూ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించాలని గుంటూరు జీజీహెచ్‌కు 2023 అక్టోబర్‌లో పంపించారు. జీజీహెచ్‌ వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించి, సందీప్‌ తల్లి పద్మావతి కిడ్నీ దానం చేయడంతో 2023 డిసెంబరు 19న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా చేశారు. సుమారు రూ. 20 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ ఉచితంగా చేశారు. నాటి నుంచి నేటి వరకు సుమారు మూడు సంవత్సరాలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయకుండా జీజీహెచ్‌ వైద్యులు మిన్నకుండి పోతున్నా ఆసుపత్రి అధికారులు చోద్యం చూస్తుండటం పేద రోగుల పాలిట శాపంగా మారింది.

వైద్యుల మధ్య సమన్వయలోపమే..!

జీజీహెచ్‌ నెఫ్రాలజీ, యూరాలజీ వైద్య విభాగాల్లో చాలా మంది సీనియర్‌ వైద్యులు ఉన్నారు. వీరిలో చాలా మంది సొంత ఆస్పత్రుల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి పేరు ప్రఖ్యాతలు, డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు. కానీ గుంటూరు జీజీహెచ్‌లో పేదలు, మధ్య తరగతి వారికి ఉచితంగా చేయాల్సిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఆస్పత్రి పరువు బజారున పడేస్తున్నారు. నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యుల మధ్య సమన్వయం లేక ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ సుమారు మూడేళ్లుగా ఆపరేషన్లు చేయటం మానివేశారు. ఫలితంగా పేద, మధ్య తరగతి రోగులు గత్యంతరం లేక ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంలో బయట ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించుకుని అప్పులపాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 20 లక్షలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లకు ఖర్చవుతుందని, అంత మొత్తంలో చెల్లించుకోలేక జీజీహెచ్‌కు వస్తుంటే వైద్యులు ఆపరేషన్లు చేయకుండా వాయిదా వేస్తున్నారంటూ పలువురు బాధితులు వాపోతున్నారు.

మూడేళ్లుగా ఒక్క ఆపరేషనూ లేదు

ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.20 లక్షలకు పైగా ఖరీదయ్యే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో 2023 డిసెంబరులో జరిగాయి. నాటి నుంచి కిడ్నీ రోగులు ఆపరేషన్‌ల కోసం జీజీహెచ్‌కు వస్తున్నా, ఆపరేషన్‌లు చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సుమారు మూడే ళ్లుగా ఒక్క ఆపరేషన్‌ చేయకుండా నెఫ్రాలజీ, యూ రాలజీ వైద్యులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వస్తున్న రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

బాధితులు అధికమే....

గుంటూరు జీజీహెచ్‌లోవారంలో కిడ్నీ జబ్బులతో 100 నుంచి 150 మంది నెఫ్రాలజీ వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంత మందికి డయాలసిస్‌ చేయడం ద్వారా కిడ్నీ సమస్య నయమవుతుంది. కిడ్ని సమస్య నయం కాకుండా డయాలసిస్‌ చేయించుకునేవారిలో 30 శాతం మందికి తప్పనిసరిగా కిడ్ని మార్పిడి అపరేషన్‌ చేస్తేనే వారి ప్రాణాలు ఉంటాయి. సుమారు రూ.20లక్షలకు పైగా ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్‌లో చేయటం ద్వారా పేద, మధ్యతరగతి వారి ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. ఆస్పత్రికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు వస్తాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆర్ధిక స్థోమత లేక ఎంతో మంది డయాలసిస్‌ చికిత్సతోనే సరిపెట్టుకుంటూ ప్రాణాపాయ స్థితిలో జీవిస్తున్నారు.

జీజీహెచ్‌లో ప్రతిరోజూ ఓపీకి వచ్చే కిడ్నీ రోగులు : 100 – 150 మంది

వీరిలో డయాలసిస్‌ అవసరమైన కిడ్నీ రోగులు : 80 – 100 మంది

కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరమయ్యే వారి సంఖ్య : సుమారు 30 – 40 మంది

2016 ఫ్రిబవరి నుంచి 2023 డిసెంబర్‌ వరకు జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు : 24

గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేయటంతో జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు రోగులు చేయించుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకునేవారు తప్పనిసరిగా గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి కమిటీ వైద్యుల అనుమతి తీసుకోవాలి. తొలుత గ్రామంలోని రెవెన్యూ, పోలీస్‌ అధికారుల అనుమతి తీసుకుని తరువాత జీజీహెచ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కమిటీ వైద్యుల అనుమతి కోసం రోగులు వస్తుంటారు. ఇలా ప్రతినెలా సుమారు 15 మందికి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసినా కొంత మేరకు రోగుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేస్తారు. మందులకు ప్రత్యేకంగా బిల్లులు చెల్లించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement