టీడీపీ నాయకుడిపై మోసం ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుడిపై మోసం ఆరోపణలు

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

గ్రీవెన్స్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన

తాడికొండ: అప్పుగా డబ్బులు ఇచ్చాడని నమ్మి భూములు రిజిస్టర్‌ చేయిస్తే టీడీపీ తుళ్లూరు మండల నాయకుడు, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు నెలకుదిటి చందు తమను నిండా ముంచాడని పలువురు బాధితులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం తుళ్లూరులో విలేకరుల సమావేశంలో వెలగలేటి బుజ్జిబాబు, కొమ్మినేని బాబ్జి, కట్టెపోగు సుగుణమ్మ (చుక్కమ్మ) మాట్లాడారు. తన తల్లి, బాబాయి వద్ద రూ.20 లక్షలు తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడని బాబ్జి తెలిపారు. తనకు చెందిన రూ.40 లక్షల విలువైన భూమికి రూ.7 లక్షలు అప్పుగా ఇచ్చి, తనఖా పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నాడని... అనంతరం భూమిని రూ.35 లక్షలకు విక్రయించాడని వెలగలేటి బుజ్జిబాబు వాపోయారు. కట్టెపోగు సుగుణమ్మ మాట్లాడుతూ.. తన 5 సెంట్ల స్థలానికి రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చి అతడి పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నాడని వాపోయారు. వేరొకరికి భూమి విక్రయించాడని తెలిపారు. చివరకు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్‌లో ఎస్పీకి ఈ మోసంపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని బుజ్జిబాబు తెలిపారు. ఇంకా పలువురిని సుమారు రూ.10 కోట్ల వరకు చందు మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎన్‌. వీరయ్య, కనిగిరికి చెందిన ఏనుగంటి శ్రీను, యడ్ల త్రినేష్‌, నేలపాటి చుక్కమ్మ, బేతు అంబేడ్కర్‌, గుజ్జర్లపూడి రవి, మాదల నరసింహమూర్తి తదితరులు ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాలకు చెందిన వారు బాధితుల్లో ఉన్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు. నిందితుడిపై కేసు నమోదు చేయడంతోపాటు తమను ఆదుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement