వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రరెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా దుగ్గిరాల వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పంచాయతీరాజ్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి వీరయ్యపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి ఖండించారు. ఈ మేరకు దుగ్గిరాలలో వీరయ్య కుటుంబ సభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నాయకత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు. వీరయ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. వీరయ్యకు ప్రజాదరణను తట్టుకోలేకే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు కేసులను అస్త్రంగా ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, వైఎస్సార్ సీపీ వెనుకడుగు వేయబోదని స్పష్టం చేశారు.


