విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి బీ ఫార్మసీ ఫలితాలు విడుదల ఐఎఫ్‌ఏసీ బోర్డు సభ్యుడిగా ఎన్నికై న ప్రసన్నకుమార్‌

నగరంపాలెం: విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పోలీస్‌ కుటుంబాల చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించగా, ఆయా పోటీల్లో విజేతలకు మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నగదు బహుమతులను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందల్‌ అందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులలో చిన్నతనం నుంచే సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయాలని అన్నారు. చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అన్నారు. కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించి, గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ సంకురయ్య, ఆర్‌ఐలు సురేష్‌ (వెల్ఫేర్‌), కృష్ణయ్య (పరిపాలన), శ్రీహరిరెడ్డి (ఎంటీ), ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ పరిధిలో జరిగిన ఎంసీఏ రెండో సెమిస్టర్‌ రెగ్యులర్‌, బీ ఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంసీఏలో 77.23 శాతం, బీ ఫార్మసీ మొదటి సెమిస్టర్‌లో 50.72 శాతం, మూడో సెమిస్టర్‌లో 55.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీవాల్యుయేషన్‌న్‌కు ఎంసీఎ విద్యార్థులు ఈ నెల 27లోగా, బీఫార్మసీ విద్యార్థులు 26, 27 తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన గౌరవం

గుంటూరు ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు డి.ప్రసన్న కుమార్‌ ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌న్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ (ఐఎఫ్‌ఏసీ) బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐఎఫ్‌ఏసీ సభ్యుడిగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో తొలిసారిగా ఎన్నికై న మొదటి చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కావడం విశేషం. తెలుగు వ్యక్తికి దక్కిన అరువైన గౌరవమని ఐసీఏఐ గుంటూరు బ్రాంచ్‌ ఛైర్మన్‌ రుద్రవరపు భరద్వాజ్‌ పేర్కొన్నారు. కొరియాలోని సియోల్‌లో జరిగిన ఐఎఫ్‌ఏసీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రసన్నకుమార్‌ను బోర్డు సభ్యుడిగా ఎన్నుకున్నారని, 2029 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని మంగళవారం తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా అకౌంటెన్సీ రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజా ప్రయోజనాలకు సేవ చేయడానికి ఐఎఫ్‌ఏసీ లక్ష్యమని భరద్వాజ్‌ తెలిపారు.

భవానీ దీక్షల స్వీకరణకు ఏర్పాట్లు

20 నుంచి మండల, వచ్చేనెల 10 నుంచి అర్ధమండల దీక్షలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక జననీ దుర్గమ్మ భవానీ దీక్షలు మండల దీక్షలకు ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. కార్తిక శుద్ధ ఏకాదశి 20వ తేదీ శుక్రవారం నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు అమ్మవారి మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. అమ్మవారికి పగడాల మాల అలంకరణతో భవానీ దీక్షలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా నూతన పూజామండపానికి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. ఆలయ అర్చకులు, గురు భవానీల చేతుల మీదగా భక్తులు దీక్షలను స్వీకరిస్తారు. శుక్రవారం నుంచి 24వ తేదీ మంగళవారం పౌర్ణమి వరకు భక్తులు అమ్మవారి మండల దీక్షలను స్వీకరించవచ్చు. అమ్మవారి ఆలయంతో పాటు ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి వద్ద కూడా భక్తులు భవానీ దీక్షలను స్వీకరించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో అర్చకులతో పాటు తమ గురు భవానీల చేతుల మీదగా దీక్షలు స్వీకరించడం ఆనవాయితీ. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి భవానీ అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ గురువారం నుంచి 14వతేదీ సోమవారం వరకు భవానీలు అర్ధమండల దీక్షలను స్వీకరించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement