ర్యాగింగ్‌తో
భవిష్యత్ అంధకారం
గుంటూరు లీగల్: యాంటీ–ర్యాగింగ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, విద్యార్థులు ర్యాగింగ్ వంటి పనులు చేస్తే అది చాలా చెడు భావనను కలిగించడమే కాకుండా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కాలేజీలోని జింఖానా హాల్‌లో మంగళవారం ర్యాగింగ్, మాదక ద్రవ్యాల నివారణపై విద్యార్థులకు అవగాహ న సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి చదువు కోవడానికి వచ్చిన విద్యార్థులంతా ఇక్కడ చాలా తక్కువ కాలం మాత్రమే ఉంటారని, ఒకరికొకరు పరిచయం పెంచుకోవడానికి ర్యాగింగ్ సరైన మార్గం కాదని, ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకోవాలన్నారు. జూనియర్లతో పరిచయం పెంచుకోవడానికి వారిని ర్యాగింగ్ చేయాల్సిన అవసరం లేదని మొదటి సంవత్సరం విద్యార్థులు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి కొత్తగా ఇక్కడికి వసారని, కాబట్టి వారు కొంత ఆందోళనగా, భావోద్వేగంతో ఉంటారని, వారిని కుటుంబ సభ్యులు గా భావించి, సంతోషంగా ఆహ్వానించాలన్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో ర్యాగింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందని కానీ హాస్టళ్లలో ఉండే వారికే ఎక్కువ ప్రేమ, శ్రద్ధ అవసరం అన్నారు. ఇల్లు వదిలి కొత్తగా వచ్చిన వారిని దగ్గరికి తీసుకుని సంతోషంగా మాట్లాడితే, వారికి భద్రతా భావం కలుగుతుందన్నారు. సరదా కోసం కెరీర్‌లో ఒక మాయని మచ్చను తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ ,వైస్ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, విద్యార్థులు పాల్గొన్నారు.


