మార్టూరు(యద్దనపూడి): బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం వేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వైపు ముగ్గురు యువకులు పల్సర్ బైక్పై ప్రయాణిస్తున్నారు. ఒంగోలులో బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మార్టూరు మండలం జొన్నతాళి ఫ్లై ఓవర్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వద్దిపాడు గ్రామానికి చెందిన శ్రీరామ్ పేతురు (27), పుల్లల చెరువు మండలం ఐటీవరం గ్రామానికి చెందిన మంద సాల్మన్(20) మృతి చెందగా మరో యువకుడు వేల్పుల నెహేమియా (18) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


