తాడేపల్లి రూరల్: ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎయిమ్స్) అంబులెన్స్ యూనియన్ల మధ్య గత కొంతకాలం నుంచి ఆధిపత్యపోరు జరుగుతోంది. మూడు యూనియన్లలో వారు తమ ఆధిపత్యపోరు కొనసాగించుకునేందుకు డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి అది తీవ్రస్థాయికి చేరడంతో ఒక యూనియన్ నాయకుడు విజయవాడ నుండి 50 మంది యువకులను పిలిపించగా, మరో యూనియన్ నాయకుడు కొంతమంది స్థానిక యువకులను సమీకరించి వడ్డేశ్వరం నుంచి ఎయిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లే రహదారిలో రోడ్డుపై కర్రలతో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లే రోగులు, డిశ్చార్జి అయ్యే వారిని అడ్డుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన కొంతమంది కర్రలతో ఒకరిపై ఒకరు దాడిచేసుకుంటూ ఆటోలను ధ్వంసం చేశారు. ఆటోను పడవేయడంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. సుమారు అర్ధగంట పాటు రోడ్డుపై ఆటో ఉండడంతో ఆ రోడ్డులో ప్రయాణించే రోగుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు జరిగిన ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే రోడ్డుపై కొట్టుకుంటున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ గొడవలో ఒక యూనియన్‌కు చెందిన సభ్యుడిని స్కార్పియో కారులో తీసుకువెళ్లినట్లు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలం వద్దే విచారణ చేపట్టగా ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ యూనియన్ నాయకుడు ఈ గొడవకు కారణమని పోలీసులకు తెలియడంతో అతనితో పాటు విజయవాడ నుంచి వచ్చిన వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
● తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి మాట్లాడుతూ సంఘటనా స్ధలం వద్ద విచారణ చేశామని, గొడవకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. అయితే ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం పోలీసు వైఫల్యమని చెప్పవచ్చు. గతరాత్రి కూడా ఇదే రోడ్డులో కొంతమంది గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కఠినచర్యలు తీసుకోకపోతే హత్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పట్నంబజారు: గంజాయి మత్తులో యువకుడు వీరంగం సృష్టించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెహ్రూనగర్‌కు చెందిన టి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రాజేంద్రకి తన నివాసం అద్దెకు ఇచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో వెంకటేశ్వరరావు తన వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేసే క్రమంలో రాజేంద్ర కుమారుడు గంగాధర్‌తో వివాదం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న గంగాధర్ వెంకటేశ్వరరావుపై దాడిచేసి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈవిషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా గంగాధర్ ప్రవర్తన ఇదేవిధంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


