16,17 తేదీల్లో ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

16,17 తేదీల్లో ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

16,17 తేదీల్లో ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి ● కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు ప్రియా పి.నాయర్‌ ● గుంటూరు పొగాకు బోర్డు సందర్శన లేబర్‌ కోర్టు న్యాయమూర్తి డి.రాములుకు డాక్టరేట్‌ కోర్టుకు వచ్చిన భార్యపై భర్త దాడి

గుంటూరు ఎడ్యుకేషన్‌ :గుంటూరులోని హిందూ కాలేజీ హైస్కూల్‌, మాజేటి గురవయ్య హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఈనెల 16,17 తేదీల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిడెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రంతోపాటు సూచనలను జాగ్రత్తగా పరిశీలించుకుని హాజరు కావాలని సూచించారు. ఈమేరకు పాఠశాల విద్య ఆర్జేడీ మార్గదర్శకాలు విడుదల చేశారని తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సమతుల్య విధానంతో ముందుకెళ్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు ప్రియా పి.నాయర్‌ తెలిపారు. బుధవారం గుంటూరులోని పొగాకు బోర్డును సందర్శించిన ఆమె పొగాకు రంగం పనితీరు, వేలం పాటలు, రైతుల సమస్యలపై సమీక్షించారు. తొలుత వెల్లంపల్లి వేలంపాట కేంద్రం (ఏఎఫ్‌ఎఫ్‌ నం.31)ను సందర్శించి పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం పొగాకు బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రైతులు, వ్యాపార ప్రతినిధులు గిట్టుబాటు ధర, పంట పరిమాణం నిర్ధారణ, అమ్ముడుపోని నిల్వల సత్వర విక్రయాలు, వాతావరణ ఆధారిత పంట బీమా, సిబ్బంది బలోపేతం, ఎగుమతుల ప్రోత్సాహం తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు వేలం పాటల్లో మెరుగైన పోటీ ఉండేలా ప్రధాన కంపెనీలు అన్ని కేంద్రాల్లో చురుగ్గా పాల్గొనాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి.విశ్వశ్రీ సూచించారు. పంట పరిమాణం, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు, వ్యాపారుల మధ్య సమన్వయం అవసరమని బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ కుమార్‌ పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, బోర్డు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పొగాకు రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రియా పి.నాయర్‌ తెలిపారు. సమావేశంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల పొగాకు రైతులు, వ్యాపార ప్రతినిధులు, బోర్డు అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు లీగల్‌: విద్యను ఆయుధంగా చేసుకుని, పేదరికాన్ని జయించి, ఉన్నతమైన న్యాయమూర్తి స్థాయికి ఎదిగి, తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన గుంటూరు ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి దున్నా రాములు ప్రస్థానం ఆదర్శనీయమని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కూనవరం అనే మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన దున్నా రాములు తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధలను ఎదుర్కొన్నారు. చదువుకోవాలనే బలమైన సంకల్పంతో క్రైస్తవ సంస్థల్లో ఉచిత భోజన సదుపాయాన్ని పొందుతూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి నేడు న్యాయమూర్తి స్థాయికి ఎదగడం అసాధారణమైన విజయగాథ. ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి డబుల్‌ ఎం.ఏ., డబుల్‌ ఎల్‌.ఎల్‌.ఎం సాధించారు. తాజాగా నవంబర్‌ 9వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘రాజ్యాంగం మరియు విలువలు’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టా పొందడం ఆయన విద్యా ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయి. ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖులు న్యాయమూర్తి దున్నా రాములుకు అభినందనలు తెలియజేశారు.

తెనాలిరూరల్‌: కోర్టు వాయిదాకు హాజరైన భార్యపై భర్త దాడి చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం వామనగుంటపాలేనికి చెందిన ఆరెమండ అలేఖ్యకు మూడేళ్ల కిందట అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన భోగినేని సూర్యప్రకాశ్‌తో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 5వ తేదీన కోర్టు వాయిదాకు వచ్చి తిరిగి వెళుతున్న అలేఖ్యను టీజే కళాశాల సమీపంలో సూర్యప్రకాశ్‌ అటకాయించి ఆమైపె దాడి చేశాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించగా వన్‌ టౌన్‌ ఎస్‌ఐ రాజ్యం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement