డ్రగ్స్‌తో భారత్‌పై పరోక్ష యుద్ధం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌తో భారత్‌పై పరోక్ష యుద్ధం

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

డ్రగ్స్‌తో భారత్‌పై పరోక్ష యుద్ధం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రత్యక్ష యుద్ధం ద్వారా భారతదేశాన్ని జయించలేని కొన్ని పొరుగు దేశాలు మన దేశ యువతను ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, మత్తు పదార్థాలతో పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్నాయని ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. బుధవారం కెలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యా భవన్‌లో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఈగల్‌ వింగ్‌, మాస్టర్‌ మైండ్స్‌ సీఏ విద్యాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు–వాటి అనర్ధాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించారు. రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను గుర్తించి, వాటిని నిర్మూలించి దోషులను కఠినంగా శిక్షిస్తున్నామని తెలిపారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని కళాశాలల్లో యువతకు, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన తరగతులు ఏర్పాటు చేసి మత్తు పదార్థాల దుష్ఫలితాలపై పూర్తి అవగాహన కల్పించి బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ చైర్మన్‌ వైడీ రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ఈగల్‌ వింగ్‌తో రెడ్‌క్రాస్‌ కలిసి సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్‌ మైండ్స్‌ విద్యా సంస్థల డైరెక్టర్‌ మట్టుపల్లి మోహన్‌ మాట్లాడుతూ తమ లక్ష్య సాధనకై పుస్తకాలను ప్రేమిస్తూ చదవాలని, సమయాన్ని వృథా చేసే మొబైల్‌ ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ పి.రామచంద్రరాజు, జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ రవి వడ్లమాని, ఇంటాక్‌ కన్వీనర్‌ ఎస్వీఎస్‌ లక్ష్మీనారాయణ, రక్తనిధి కేంద్రాల రాష్ట్ర సమన్వయకర్త బీవీఎస్‌ కుమార్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా కార్యదర్శి జె.రఘుస్వర్ణ, ఈగల్‌ వింగ్‌ పోలీస్‌ అధికారులు, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement