మెప్మాలో అంతా మాయ | - | Sakshi
Sakshi News home page

మెప్మాలో అంతా మాయ

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

డ్వాక్రా నిధుల గోల్‌మాల్‌ కేసులో సీఓ నాటకాలు విచారణ పూర్తికాకముందే మంగళగిరికి బదిలీ ఇప్పటికీ గుంటూరులోనే తిష్ట వేసిన వైనం ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

ఆత్మహత్యాయత్నం

వరకు వెళ్లిన

వైనం..

నెహ్రూనగర్‌: డ్వాక్రా మహిళల కష్టార్జితాన్ని మింగేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కమ్యూనిటీ ఆర్గనైజర్‌ (సీఓ) ఆదినారాయణను కాపాడేందుకు మెప్మా అధికారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్‌ నియమించిన విచారణాధికారి విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వకముందే, బాధ్యుడైన సీఓను మంగళగిరికి బదిలీ చేస్తూ మెప్మా పీడీ విజయలక్ష్మి గత అక్టోబర్‌ నెలలో హడావుడిగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

నివేదిక రాకముందే బదిలీ వ్యూహం..

క్షేత్రస్థాయిలో విచారణ సాగుతుండగానే, నివేదిక రాకముందే సీఓ ఆదినారాయణను మంగళగిరికి బదిలీ చేస్తూ పీడీ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక పక్కా వ్యూహం దాగి ఉందనే విమర్శలున్నాయి. అక్టోబర్‌ 13వ తేదీ నాటి ఉత్తర్వులను గుట్టుచప్పుడు కాకుండా అక్టోబర్‌ 14న విడుదల చేసి బాధితుల కళ్లుగప్పే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి. నివేదిక వచ్చేలోపే సంబంధిత సీఓను విచారణ పరిధి నుంచి తప్పించాలనే దురుద్దేశంతోనే ఈ బదిలీ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ సీఓ ఆదినారాయణ ఇప్పటికీ గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలోనే తిష్ట వేసినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌ అధికారులు గుంటూరు నుంచి రిలీవింగ్‌ ఆర్డర్‌ కావాలని కోరడంతో ఇంతవరకు ఆయనను రిలీవ్‌ చేయలేదని సమాచారం. అయితే, పట్టణాల్లో ఎన్నికల కోడ్‌ ఎత్తివేసి రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన్ను ఇంకా రిలీవ్‌ చేయకుండా గుంటూరులోనే అట్టిపెట్టుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసినవారు తమవారైతే ఏ విధంగానైనా కాపాడి, సమస్యను గప్‌చుప్‌గా సర్దుబాటు చేసేందుకు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనలకు తిలోదకాలు..

మెప్మా కార్యాలయంలో కొద్ది నెలలుగా ఇదే తంతు కొనసాగుతోందని ఆరోపణలున్నాయి. ఆర్పీలకు జీతాల కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన ఓ సీఓపై 12వ డివిజన్‌కు చెందిన ఆర్పీలు జూలై 19న తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు ఫిర్యాదు చేసినా, సదరు సీఓపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, ఆ సీఓను మెప్మా కార్యాలయంలో కూర్చోబెట్టి, ఎలాంటి విధులు కేటాయించకుండానే జీతాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెప్మాలో చెప్పుకుంటూ పోతే ప్రతి వార్డులోనూ లోతైన విచారణ చేపడితే ఇలాంటి విషయాలే బయటపడతాయని భావిస్తున్నారు. మెప్మాలో ఇదే పరిపాటిగా మారిందనే విమర్శలు లేకపోలేదు. సీఓ ఆదినారాయణ బదిలీ విషయంపై ఉపా సెల్‌ పీఓ సింహాచలంను వివరణ కోరగా, ఎన్నికల కోడ్‌ కారణంగా ఆయనకు రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదని తెలిపారు. వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇచ్చి మంగళగిరికి పంపుతామని చెప్పారు.

నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాల కోసం చెల్లించిన వాయిదాల సొమ్మును ఆర్పీ గౌసియా, సీఓ ఆదినారాయణలు కుమ్మకై ్క స్వాహా చేసినట్లు బాధితులు ఆరోపించారు. కాజేసిన సొమ్మును తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిలదీస్తే ఆర్పీ దుర్భాషలాడడంతో బాధితులు మెప్మా అధికారుల చుట్టూ తిరిగారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన బాధిత గ్రూపు లీడర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో నగరపాలక సంస్థ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ స్పందించి, స్వర్ణ వార్డు సచివాలయ విభాగం అదనపు కమిషనర్‌ రవీంద్రను విచారణాధికారిగా నియమించారు. అయితే, ఈలోపు ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఆ విచారణ కూడా అటకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement