స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో నగరానికి మూడో స్థానం
నెహ్రూనగర్: జాతీయ స్థాయిలో గుంటూరుకు మరోసారి గుర్తింపు లభించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం నుంచే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న గుంటూరు నగరం... ఆ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ‘సూపర్ స్వచ్ఛ లీగ్’ (స్వచ్ఛ షహర్ తృతీయ స్థానం) అవార్డు లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ బి.సునీల్ కుమార్ రెడ్డితో కలిసి గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నగరంలో వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం, కొత్త బయో ప్లాంట్ ఏర్పాటు, ఎలక్ట్రిక్ ఆటోలు, అత్యాధునిక స్వీపింగ్ యంత్రాల వినియోగం, అలాగే ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ (సాసా), ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని కమిషనర్ తెలిపారు. ఈ పురస్కారం నగర ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషికి దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. గుంటూరును మరింత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కమిషనర్ వెల్లడించారు.


