హాస్టళ్ల పనులను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

హాస్టళ్ల పనులను పూర్తి చేయాలి

Nov 12 2026 1:13 AM | Updated on Nov 12 2026 1:13 AM

జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ తాడికొండ గురుకుల వసతి గృహాల పరిశీలన

తాడికొండ: మార్పు పథకంలో చేపట్టిన ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాల మేరకు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ ఆదేశించారు. తాడికొండలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల వసతి గృహం, ఎస్‌వీవీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి మయూరి, తహసీల్దార్‌ సీతారామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎంఎస్‌ఎంఈల స్థాపన వేగవంతం చేయాలి

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాస్తవ, ఇతర రెవెన్యూ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలు తమ యూనిట్ల స్థాపన పనులను వెంటనే ప్రారంభించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టి గ్రౌండింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. స్థల సేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాల మేరకు పరిశ్రమల ఏర్పాటులో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీవోలు శ్రీనివాసరావు, శ్రీ రమణి, పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి అభినవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement