వీకెండ్‌కు చలో హైదరాబాద్
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌కు బాస్‌గా పిలువబడే మెడికల్ సూపరింటెండెంట్ తరచుగా సెలవులు పెడుతున్నారు. సూపరింటెండెంట్ తర్వాత అత్యంత కీలకమైన సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ సైతం సెలవుల్లో మునిగి తేలుతున్నారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లకు బాస్‌గా వ్యవహరించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) గుంటూరు జీజీహెచ్‌లో ఐవీఎఫ్ వైద్యసేవలు అందించే సెంటర్ ఏర్పాటు కోసం తనిఖీలు చేశారు. డీఎంఈ తనిఖీల సమయంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు ఇద్దరూ సెలవులో ఉన్నారు. తాజాగా సోమవారం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అండ్ మిషన్ డైరెక్టర్ ( ఏబీడీఎం) కిరణ్‌గోపాల్ వస్కా గుంటూరు జీజీహెచ్‌లో తనిఖీలు చేశారు. సోమవారం కూడా సూపరింటెండెంట్, సిఎస్‌ఆర్‌ఎం ఇద్దరూ కూడా సెలవుల్లో ఉండంటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ర్యాంకింగ్స్‌లో ఢమాల్!
గుంటూరు జీజీహెచ్‌కు కీలకమైన ఇద్దరు వైద్యాధికారులు వీకెండ్స్‌కు, పండుగలకు తరచుగా సెలవులు పెడుతూ ఉండటంతో ఉన్నతాధికారులు లేరనే ధీమాతో కొంతమంది వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రుల పనితీరులో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో జీజీహెచ్ ర్యాంక్ 16కు పడిపోయిందనే విమర్శలు ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో వైద్యులు ఉంటున్నారా? లేదా? అనే విషయంపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 26 శాతం రోగులు వైద్యులు ఉండటం లేదనే సమాధానం ఇచ్చారు. వైద్యులు విధుల్లో లేకపోతే వారి కింద పనిచేసే వైద్య సిబ్బంది బయట సొంత పనులు చక్కబెట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌కు సుమారు ఏడు జిల్లాలకు చెందిన రోగులు ప్రతిరోజూ మూడువేలకు మందికి పైగా వైద్యసేవల కోసం వస్తుంటారు. వారి నమ్మకం సన్నగిల్లిపోకుండా సకాలంలో సత్వర వైద్యసేవలు అందేలా కీలక వైద్యాధికారులు విధుల్లో ఉండి చూడాల్సిన బాధ్యత ఉంది. జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ సీఎం సాయికాంత్ వర్మ గుంటూరు జీజీహెచ్ పనితీరుపై దృష్టిసారించి పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ శనివారం, ఆదివారం తప్పనిసరిగా సెలవులు పెట్టి హైదరాబాద్ వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, సొంత ప్రాక్టీస్ చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సూపరింటెండెంట్ లేని సమయాల్లో సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు ఆస్పత్రిలో అందుబాటులో ఉండి వైద్యసేవలకు అంతరాయం లేకుండా చూడాల్సి ఉంది. కాని ఈయన కూడా సూపరింటెండెంట్‌తోపాటే వీకెండ్స్ ఊరికి వెళ్తున్నారు. ఆస్పత్రి పరిపాలనలో కీలకమైన ఇద్దరు వైద్యాధికారులు వీకెండ్స్ లేకపోవటంతో వారంతపు రోజుల్లో చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర వైద్యసేవల విభాగానికి వచ్చే రోగులకు వీకెండ్స్‌లో, రాత్రిళ్లు వైద్యసేవలు సకాలంలో, సక్రమంగా అందక కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జీజీహెచ్‌లో వీకెండ్ సెలవుల్లో కీలక అధికారులు
తరచుగా సెలవుల్లో
జీజీహెచ్ సూపరింటెండెంట్,
సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓలు
ఉన్నతాధికారుల పర్యటనలకు
సైతం డుమ్మా
వారాంతపు సెలవులు తప్పనిసరి
కీలక అధికారులు లేకపోవటంతో
మండకొడిగా వైద్యసేవలు
ఇబ్బందులు పడుతున్న రోగులు


