జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
● రెండు దశల్లో పోలింగ్
● 26న గుంటూరు డివిజన్‌లోని
97 పంచాయతీలకు..
● 29న తెనాలి డివిజన్‌లోని
111 పంచాయతీలకు ఎన్నికలు
● రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు
పంపిన జిల్లా పంచాయతీ అధికారులు
గుంటూరు వెస్ట్: జిల్లాలో 208 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా పంచాయతీ శాఖాధికారులు సమాయాత్తమవుతున్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రపోజల్స్ పంపారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలోని గుంటూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలైన గుంటూరు రూరల్, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, మేడికొండూరు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, పెదకాకాని మండలాలకు తొలి దశలో మొత్తం 97 గ్రామ పంచాయితీలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించడం. రెండో దశలో తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలైన తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, కాకుమాను, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లోని 111 గ్రామ పంచాయితీలకు ఈ నెల 29న ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని ప్రపోజల్స్ పంపారు. తుళ్లూరు, తాడికొండ మండలాలతోపాటు మంగళగిరిలోని కొన్ని గ్రామాలు సీఆర్డీఏ పరిధిలోకి వెళ్లడంతో అక్కడ ఎన్నికల నిర్వహణను ఆపేశారు. వాస్తవానికి ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుంటూరు జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిషికేషన్ విడుదల చేయనుంది. దీంతో పంచాయతీ శాఖాధికారులు పంపిన ప్రపోజల్స్ దాదాపుగా అంగీకరిస్తారు. లేకపోతే కొన్ని మార్పులతో అంగీకరించే అవకాశం ఉంది.
మహిళా ఓటర్లే అధికం...
208 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,88,458 కాగా మహిళలు అధికంగా 3,04,108 మంది ఉన్నారు. పురుషుల సంఖ్య 2,84,315 మంది ఉండగా ఇతరులు 35 మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో 1042 వార్డులు, తెనాలిలో 1166 వార్డులు మొత్తం 2208 కాగా పోలింగ్ కేంద్రాలు మొత్తం 2317 ఇప్పటికే అధికారులు ఖరారు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంసిసి ( మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలవుతుండడంతో ఇక మార్పుకు అవకాశంలేదు.
రిజర్వేషన్లు ఇలా..
208 స్థానాలకు గానూ రిజిర్వేషన్ల కోటా కింద 101 సీట్లు కేటాయించగా అన్‌రిజర్వ్‌డ్‌గా 107 ఉన్నాయి. ఈ కింద తెలిపిన రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు.
కేటగిరీ మహిళలు పురుషులు
ఎస్టీ 1 9
ఎస్సీ 26 30
బీసీ 18 17
అన్ రిజర్వుడు 56 51
మొత్తం 101 107


