గుంటూరు వెస్ట్: గృహ స్థలాల రెగ్యులరైజేషన్ ప్రక్రియకు స్పష్టమైన విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డీకేటీ, జీఓ 30, 306, దేవదాయ భూములు, వక్ఫ్, అభ్యంతరకర భూములు, ఇతర విభాగాల కింద ఉన్న భూములను విచారణ చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించిన విధంగా వివిధ విభాగాల వారీగా ఉన్న స్థలాల్లో ఉన్న వారి అర్హతను గుర్తించాలని చెప్పారు. ఇందుకు గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు పొందాలని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలు, దారులు తదితర అభ్యంతర విభాగాల కింద ఉన్న స్థలాలను పక్కాగా విచారణ చేపట్టాలన్నారు. జలవనరుల శాఖ, భూగర్భ జలాల శాఖ తదితర సంబంధిత శాఖల నుంచి నివేదికలు పొందాలని సూచించారు. వీటిని అమలు చేసేందుకు స్పష్టమైన విధి విధానాలు తయారు చేయాలని వివరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, కె.శ్రీరమణి, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, ఎ.లక్ష్మీకుమారి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


