గుంటూరు ఎడ్యుకేషన్: మిషన్ మార్చ్–2027లో భాగంగా 10వ తరగతి ఎస్‌ఏ–1 పరీక్షలకు పక్క మండలాల నుంచి పాఠశాల స్థాయి పరిశీలకుల నియామక ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దార్ల పెద్దబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నంను కలసిన ఎస్టీయూ ప్రతినిధుల బృందం వినతిపత్రం సమర్పించారు. వారు మట్లాడుతూ గతంలో అమలు చేసిన ఈ విధానంతో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని, స్థానికంగా అనువైన ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో అనారోగ్యానికి గురైన, మరణించిన ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు ఎన్నికల కమిషన్ ద్వారా న్యాయం జరిగేలా అవసరమైన ప్రతిపాదనలు పంపించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి తగు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. డీవైఈవోను కలసిన వారిలో ఎస్టీయూ గుంటూరు నగర అధ్యఽక్ష, ప్రధాన కార్యదర్శులు బుగ్గ మహంకాళరావు, శంకర వరప్రసాద్ తదితరులు ఉన్నారు.


