సమాచారం తెలుసుకుని స్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అర్ధరాత్రి దాటిన వదిలిపెట్టని పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అంటూ ముక్తాయింపు
లక్ష్మీపురం: గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెం గ్రామం సెగ్మెంటు వన్‌లోని బ్యాలెట్ బాక్సును నల్లపాడు సమీపంలోకి మారుస్తుండగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి గురువారం నిరసనకు దిగారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం లో పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జీ చేసి వైఎస్సార్ సీపీ శ్రేణులను చెల్లాచెదురు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జినూరి ఫాతిమా ,ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డైమండ్ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నగరంపాలెం పోలీస్ స్టేషన్కు గురువారం రాత్రి చేరుకున్నారు. స్టేషన్‌కు తరలించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి నోటీస్ ఇచ్చి పంపిస్తామంటూ సుమారు గంటకు పైగా స్టేషన్లోనే ఉంచడంపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన మరుక్షణమే నోటీసు ఇచ్చి అప్పిరెడ్డిని విడుదల చేస్తామంటూ పోలీసులు చెబుతున్నారు.
అప్పిరెడ్డిపై అక్రమ కేసు నమోదుకు యత్నం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిపై అక్రమ కేసు నమోదుతోపాటు పాత కేసులు తిరగ తోడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ చేసిన అక్రమాలను కనీసం ఏ అఽధికారి పట్టించుకోకపోవటంపై వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తప్పు చేసిన వారిని వదిలి ప్రతిపక్ష నేతలపై విచ్చలవిడిగా కేసులు పెట్టడంపై మండిపడుతున్నారు. టీడీపీ నాయకులతో కలసి సీఐ కావాలనే ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.


