పోలీసులు, టీడీపీ నేతలతో కలిసి అరాచకాలకు పాల్పడుతున్నారు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్
గుంటూరు రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్ పరిశీలించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాం రసూల్‌తో కలిసి తురకపాలెం, వెంగళయాపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. నాయకులను అడిగి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బలసాని మాట్లాడుతూ కూటమి నేతల అండతో, ఓటు వేయడానికి వచ్చిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై వెంగళాయపాలెంలో సీఐ భాస్కర్ లాఠీ చార్జ్ చేయటంతో విషయం తెలుసుకొని రావటం జరిగిందన్నారు. టీడీపీ నేతలతో చేతులు కలిపి పోలీసులు పోలింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులతో కలిసి అరాచకం సృష్టించి, అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తల్లా పోలింగ్ బూత్‌ల వద్ద పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ పోలీసులు, టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మద్యం మత్తులో సీఐ వీరంగం సృష్టించటం దారుణమని తెలిపారు. ఆయనవెంట వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


