నెహ్రూనగర్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తీర్పు ఇచ్చి గెలిపించిన ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి, ఓడిపోయిన అభ్యర్థులను తెరపైకి తెచ్చే వికృత రాజకీయాలకు కూటమి నేతలు తెరలేపారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రెండో డివిజన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన మాదాను ఉషారాణి ప్రత్యర్థిపై విజయం సాధించి అధికారికంగా కార్పొరేటర్‌గా గెలుపొందారు. ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి.. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న అహంకారంతో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి షేక్ షాహినా గెలిచినా, ఓడినా ఆమే కార్పొరేటర్ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, తప్పుడు ప్రచారాలతో కూడిన పోస్టర్లను వైరల్ చేస్తున్నారు. ‘ప్రభుత్వం ఉన్నంతవరకు ఏ పని కావాలన్నా రెండో వార్డులో ఆమె ద్వారానే జరుగుతాయి‘ అంటూ టీడీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించిన నాయకురాలిని కాదని, ఓడిపోయిన వ్యక్తిని నెత్తికెత్తుకోవడంపై స్థానికంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక అధికార బలంతో ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాతీర్పును అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై ఎన్నికల అధికారులు, పోలీసులు స్పందించి తక్షణమే తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


