గుంటూరు మేయర్‌గా అపర్ణ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

గుంటూరు మేయర్‌గా అపర్ణ ఎన్నిక

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగర మేయర్‌గా టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం సాధించారు. మంగళవారం ఏఎన్‌యూలో జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె 1,67,284 ఓట్లు సాధించారు. వైఎస్సార్‌ సీపీ నుంచి మేయర్‌ పదవికి పోటీ పడిన తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి 90,217 ఓట్లతో లక్ష్మీ అపర్ణకు గట్టి పోటీ ఇచ్చారు.

తెనాలి మున్సిపల్‌ చైర్మన్‌గా తోటకూర విజయం

తెనాలి: తెనాలి మున్సిపాలిటీని కూటమి కై వసం చేసుకుంది. ఒకటో తేదీన పోలింగ్‌ నిర్వహించగా మంగళవారం స్థానిక వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్లు లెక్కించారు. జనసేన తరఫున మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తోటకూర వెంకట రమణరావు తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌ సీపీకి చెందిన మద్దాళి శేషాచలంపై 17,093 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ 31 స్థానాల్లో పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థులు 29 వార్డుల్లో గెలుపొందారు. జనసేన 20 స్థానాల్లో పోటీ చేయగా 16 మంది గెలిచారు. బీజేపీ పోటీ చేసిన ఏకై క వార్డులో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు.

నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు

గుంటూరు వెస్ట్‌: మురసు తుపాను కారణంగా జిల్లాలోని పాఠశాలకు, జూనియర్‌ కళాశాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. పిల్లల్ని బయటకు పంపకుండా తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

రేపు బ్యాంకులకు కూడా సెలవు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకుని కలెక్టర్‌ గురువారం సెలవు ప్రకటించారు. గుంటూరు, తెనాలి సహా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు జిల్లాలోని ఇతర ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది.

కొండ చరియలు విరిగి పడి మహిళ మృతి

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధి పెనుమాక గ్రామం బోసుబొమ్మ సెంటర్‌లోని వడ్డెరపాలెంలో మంగళవారం రాత్రి కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ కొండ చరియలు ఓ ఇంటి మీద పడడంతో ఇంట్లోని మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సేకరించిన వివరాల ప్రకారం.. వడ్డెరపాలెంలోని షేక్‌ జానీవలి ఇంటిమీద ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొండ చరియలు జారి పడ్డాయి. ఈ క్రమంలో కొండ బండరాళ్లు, ఇంటి గోడలు పగిలి వంట గదిలో ఉన్న జానీవలి భార్య షేక్‌ మీరాబీ(50) మీద పడ్డాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తాడేపల్లి తహసీల్దార్‌ శ్రావణ్‌ కుమార్‌ బాధితుల ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేశారు.

పునరావాస కేంద్రాల ఏర్పాటు

మంగళగిరి రూరల్‌: మురసు తుఫాన్‌ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం రెవెన్యూ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళగిరి మండల పరిధి ఆత్మకూరు, పెదవడ్లపూడి, యర్రబాలెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఎంటీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. తుపాను ప్రభావం తగ్గే వరకు బాధితుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా

ఉండాలి

నరసరావుపేట రూరల్‌: మురసు తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంబాలు, విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించవద్దని చెప్పారు. వాతావరణ శాఖ, ప్రభుత్వ అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తుఫాన్‌ కారణంగా ఏమైన ఇబ్బందులు ఎదురైన అత్యవసర పోలీసు సహాయం కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ 94407 96184, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ 112కు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement