చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్: ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై మంగళవారం ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్ట విద్య, న్యాయవృత్తిలో వస్తున్న మార్పులు, ఆధునిక న్యాయ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్టారెడ్డి మాట్లాడుతూ 21వ శతాబ్దం ఆసియా శతాబ్దంగా నిలవనుందని, ప్రపంచ న్యాయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్య చట్టాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బ్రెట్టన్ వుడ్స్ సంస్థలపై న్యాయ విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, డిజిటలైజేషన్ వంటి పరిణామాలు న్యాయ వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో న్యాయవాదులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది అడ్వకేట్ భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ భూ చట్టాలు న్యాయవృత్తిలో ఎప్పటికీ ప్రాధాన్యత కలిగిన రంగమని, ఈ విభాగంలో న్యాయవాదులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాస దశ నుంచే సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, గ్రామీణ ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ లావు రత్తయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు అడ్వకేట్ జి.మధుసూదన్‌రెడ్డి, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకృష్టారెడ్డి


