ప్రశాంత ఎన్నికలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Oct 27 2026 1:44 AM | Updated on Oct 27 2026 1:44 AM

జిల్లా వ్యాప్తంగా 2 వేల మంది బైండోవర్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రత్తిపాడు: ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందిని ఇప్పటివరకు బైండోవర్‌ చేశామని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. వట్టిచెరుకూరు, కాకుమాను, ప్రత్తిపాడు మండలాల్లోని సమస్మాతక, అత్యంత సమస్మాతక గ్రామాల్లో సోమవారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. అక్కడ ఉన్న ఏర్పాట్లు, బూత్‌ల సంఖ్య, ఓటర్ల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏవిధమైన పోలింగ్‌ ఏర్పాట్లు చేయాలి.. వంటి అంశాలను డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలకు వివరించారు. ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజకీయ పార్టీల నాయకులు, నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు మంచి వాతావరణంలో ప్రశాంతంగా జరిగేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ట్రబుల్‌ మంగర్స్‌, అగ్రెసివ్‌గా తిరిగే వాని బైండోవర్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో రెండు వేల మందిని బైండోవర్‌ చేశామని చెప్పారు. అదేవిధంగా ఆయుధ లైసెన్సు కలిగిన వారి నుండి ఆయుధాలను డిపాజిట్‌ చేసుకున్నామని తెలిపారు. గొడవలు, ఘర్షణలు జరిగే అవకాశాలున్న గ్రామాలను గుర్తించి సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ గ్రామాలుగా నిర్ధారించామన్నారు. నిర్ణీత గ్రామాల్లో ఎక్కువ పోలిస్‌ను ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకోసమే ముందస్తు చర్యల్లో భాగంగా పోలింగ్‌బూత్‌లు పరిశీలించామని చెప్పారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ప్రజలు ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. గ్రామాల్లో ఎక్కడైనా ఏమైనా సమస్యలున్నా, గొడవలు జరిగే అవకాశాలున్నా, బెదిరింపులకు పాల్పడుతున్నా స్థానిక పోలీసులకు తెలియజేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంగణంలో కేవలం ఓటు వేసే ఓటర్లు మాత్రమే రావాలని, పోలింగ్‌ స్టేషన్లకు వంద మీటర్ల పరిధిలో జనం గుమిగూడకూడదని తెలిపారు. 200 మీటర్ల అవతల ప్రతి రాజకీయ పార్టీకి ఒక టెంటు వేసుకునేందుకు అనుమతిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఆఖరి 48 గంటలు ప్రచారం జరగకూడదని, లౌడ్‌ స్పీకర్లు వాడకూడదని చెప్పారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అన్ని పార్టీలు బాధ్యత తీసుకుని సాఫీగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో గుంటూరు సౌత్‌జోన్‌ డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌, సీఐ సుబ్బారావు, ఏఆర్వో కె.శివపార్వతి, ఎస్‌ఐ ఎన్‌.నరహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement