200 మందితో చేరిన టీడీపీ నేత పీఎండీ అలీ ఖాన్ శారదా కాలనీలో పలువురి చేరికలు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి మరో భారీ ఊపు లభించింది. గుంటూరు నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా సమక్షంలో 17వ కార్పొరేటర్ అభ్యర్థి రమణబోయిన అజయ్ ఆధ్వర్యంలో హుస్సేన్ నగర్‌కు చెందిన ‘జాహిద్ అలీ లీగల్ ప్రైవేట్ యూనిట్’ ఫౌండర్ పీఎండీ అలీ ఖాన్ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనతో పాటు సుమారు 200 మంది మహిళలు పార్టీలో చేరగా, నూరి ఫాతిమా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫాతిమా మాట్లాడుతూ గతంలో వైఎస్సార్ సీపీ చేసిన అభివృద్ధి పనులు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, నగర అభివృద్ధికి కృషి చేసేందుకు ముందుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
67వ డివిజన్, శారదా కాలనీలో..
నగరంలోని 67వ డివిజన్, శారదా కాలనీలో వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు జరిగాయి. కార్పొరేటర్ అభ్యర్థి చీదర్ల జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 40 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరీ ఫాతిమా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. నూరీ ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. పార్టీ బలోపేతానికి, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


