గుంటూరు వెస్ట్: ఎన్నికల్లో మైక్రో పరిశీలకుల పాత్ర కీలకమని సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య అన్నారు. స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మైక్రో పరిశీలకుల శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ మైక్రో పరిశీలకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలింగ్ గదిలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎంతమంది ఎన్నికల ఏజెంట్లు ఉన్నారో పక్కాగా నమోదు చేయాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో అనధికార వ్యక్తులు ఎవరైనా ప్రవేశిస్తున్నారా, ఓటు వేసిన వ్యక్తికి సిరా పెట్టారా వంటి అంశాలను గమనించి నివేదికలో పొందుపరిచాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి పూర్తి అయిన సమయం వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాలెట్ బాక్స్ సీలింగ్ చేయడం దాన్ని ఏజెంట్లకు వివరించడం జరగాలని చెప్పారు. ఒక సమయంలో ఒకే ఏజెంట్ ఉండాలని, పోస్టల్ బ్యాలెట్ జారీ చేసిన వ్యక్తులు మరల ఓటు కోసం వచ్చారా వంటి అంశాలను కూడా గమనించాలని పేర్కొన్నారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్ దగ్గర సీక్రసీ తప్పక ఉండాలన్నారు. కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు నందిని సలారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి పాల్గొన్నారు.
ఎంసీఎంసీ విభాగం పరిశీలన
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఎండ్ మానిటరింగ్(ఎం.సి.ఎం.సి) కమిటీ విభాగాన్ని ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా సోమవారం పరిశీలించారు. స్థానిక బ్రాడీపేటలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ విభాగాన్ని తనిఖీ చేశారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, ప్రీ సర్టిఫికేషన్ అంశాలను పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు. అన్ని చానల్స్ లో ప్రసారాలను విధిగా పరిశీలించాలని కోరారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, ఎం.సి.ఎం.సి విభాగం పనితీరును వివరించారు. ఇప్పటి వరకు ఫ్రీ సర్టిఫికేషన్ క్రింద ఏడు అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఏవీఎస్ రవీంద్ర, సహాయ కార్యనిర్వహక ఇంజినీర్ ఏ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల జిల్లా పరిశీలకుడు వీరబ్రహ్మయ్య


