తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

గుంటూరు వెస్ట్‌: అర్ణబ్‌ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తుపాను వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పూర్తి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అతి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, వాటితోపాటు కొండవీటి వాగు, గుంటూరు నాలా, పీకల వాగు తదితర వాగులు, చానల్‌లను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి వాటి ప్రవాహాన్ని గమనించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ, ఇతర మున్సిపాలిటీలలో కాలువల పరిస్థితిని గమనించాలన్నారు. అన్ని తాగునీటి రిజర్వాయర్లు నింపి ఉంచాలన్నారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం వలన రవాణాకు ఆటంకం ఏర్పడకుండా ట్రీ కట్టర్స్‌, పవర్‌ సాస్‌లను సిద్ధంగా పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని బంకుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో ఉండే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. టెలికాం, మొబైల్‌ సేవలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా కంపెనీలు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులు పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంతో పాటు మండల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రైతులకు సూచనలు చేయాలి

రైతులను అప్రమత్తం చేయాలని, అవసరమైన సూచనలు సలహాలను అందించాలని ఆదేశించారు. పశువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వాటికి తగిన ఆహారం అందే ఏర్పాట్లు చేయాలన్నారు. వాగులు, వంకలు, నదులు ఎవరు దాటొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement