పెదకాకాని: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. మండల పరిధిలోని తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 20 కుటుంబాలు గురువారం వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ తమనం భూషణం ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న అరాచకాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వారు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రజలకు చేసిన మేలు, తక్కెళ్ళపాడు గ్రామ అభివృద్ధి తదితరాలకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. ఈ చేరికలు వైఎస్సార్ సీపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేస్తారన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో దాసరి వేణు గోపాల్, బెజ్జం నికిత్, మిరియాల సుమంత్, మిరియాల మహేష్, తమనం వినోద్ కుమార్, దార్ల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.


