గుంటూరు టీడీపీ మేయర్‌ అభ్యర్థికి తీవ్ర అసమ్మతి సెగ | - | Sakshi
Sakshi News home page

గుంటూరు టీడీపీ మేయర్‌ అభ్యర్థికి తీవ్ర అసమ్మతి సెగ

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

గుంటూరు టీడీపీ మేయర్‌ అభ్యర్థికి తీవ్ర అసమ్మతి సెగ

లక్ష్మీ అపర్ణ పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు గల్లా, నసీర్‌, రామాంజనేయులు వర్గాలు మేయర్‌ పీఠం కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడంపై కాపు నేతల భగ్గు మిత్రధర్మం గాలికొదిలేస్తే అన్నిస్థానాల్లో పోటీ చేస్తామంటున్న బీజేపీ ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థిగా శ్రీదేవి.. మారిన రాజకీయ సమీకరణాలు అన్నివర్గాల నుంచి వైఎస్సార్‌ సీపీకి వెల్లువెత్తుతున్న మద్దతు

ఫలించిన వైఎస్సార్‌ సీపీ వ్యూహం

సాక్షి ప్రతినిధి,గుంటూరు: గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల వేళ కూటమిలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మేయర్‌ అభ్యర్థి ఎంపిక తెలుగుదేశం పార్టీలో తీవ్ర ముసలానికి దారితీసింది. పార్టీ అధిష్టానం మేయర్‌ అభ్యర్థిగా లక్ష్మీ అపర్ణ పేరును తెరపైకి తీసుకురావడంతో స్థానిక నాయకత్వం ఒక్కసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలు సైతం టీడీపీ ఏకపక్ష నిర్ణయాలపై రగిలిపోతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌ సీపీ వ్యూహాత్మకంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవిని రంగంలోకి దింపడంతో నగరంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

సొంత గూట్లోనే అసమ్మతి..

లక్ష్మీ అపర్ణ అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఎమ్మెల్యేలే తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్‌ అహ్మద్‌, బూర్ల రామాంజనేయులు వర్గాలు ఈ నిర్ణయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి, ప్రజాబలం లేనివారికి ఎలా టికెట్‌ కేటాయిస్తారంటూ ఆయా వర్గాల నేతలు అంతర్గత సమావేశాల్లో బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2024 నుంచి ఎమ్మెల్యే గల్లా మాధవికి లక్ష్మీ అపర్ణ భర్త అయిన కోవెలమూడి నానికి కోల్డ్‌ వార్‌ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మేయర్‌ అభ్యర్థి స్థానాన్ని నాని సతీమణికి కేటాయించడంతో గల్లా మాధవి తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం.

భగ్గుమంటున్న కాపు నేతలు

మేయర్‌ పీఠాన్ని మరోసారి కమ్మ సామాజిక వర్గానికే కేటాయించడంపై నగరంలోని కాపు సామాజిక వర్గ నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన కాపులను పదవుల పంపకంలో పూర్తిగా విస్మరించారని జనసేన కేడర్‌తో పాటు టీడీపీలోని కాపు నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీని పూర్తిగా డమ్మీ చేయాలని చూస్తున్నారంటూ కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్రధర్మం పాటించకుండా తమను విస్మరిస్తే నగరంలోని అన్ని స్థానాల్లో స్వతంత్రంగా అభ్యర్థులను నిలబెడుతూ బీజేపీ నేతలు హెచ్చరిస్తుండటంతో కూటమిలో గందరగోళం మరింత పెరిగింది.

కూటమిలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్న వేళ, వైఎస్సార్‌ సీపీ వేసిన అడుగు రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన, బలమైన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవిని మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో సమీకరణాలన్నీ వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా మారాయి. అటు వ్యాపార వర్గాలతో పాటు ఇటు అన్ని సామాజిక వర్గాల్లోనూ శ్రీదేవికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. స్థానికంగా వివాదరహితురాలిగా పేరుండటం, సామాజిక సమతుల్యత పాటించడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వైపే గుంటూరు ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే చెప్పుకోవచ్చు. కూటమిలోని వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్‌ సీపీ నాయకత్వానికే జైకొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement