టీడీపీపై బ్రాహ్మణుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

టీడీపీపై బ్రాహ్మణుల ఆగ్రహం

Oct 20 2026 4:25 AM | Updated on Oct 20 2026 4:25 AM

బీజేపీకి నిరాదరణ... రెబెల్స్‌ నామినేషన్లు

తెనాలి: పట్టణ ఓటర్లలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న బ్రాహ్మణ వర్గానికి కనీసం ఒక్కటంటే ఒక్క వార్డు కేటాయించలేదు. ఇస్తానని చెప్పిన వార్డులోనూ బ్రాహ్మణులకు ఇవ్వకుండా చివరి నిమిషంలో జనసేన పార్టీకి చెందిన బ్రాహ్మణేతర సామాజికవర్గానికి ఇచ్చారు. హామీనిచ్చిన అభ్యర్థికి నామినేషన్లకు చివరిరోజున ఉదయం ‘సారీ’ చెప్పారు. నమ్మించి వంచించటంపై బ్రాహ్మణ సంఘీయులు, తమ ఆత్మగౌరవం దెబ్బతిందని విలేకరుల సమావేశంలో ఆవేదనపడ్డారు. మరోవైపు బీజేపీకి కేటాయించిన వార్డుపైనా ఆ పార్టీ స్థానిక నాయకులు కినుక వహించారు. ఏకంగా ఆరేడు రెబెల్‌ అభ్యర్థులు నామినేషన్‌ వేసినట్టు సమాచారం.

వెన్నుపోటుపై ఆగ్రహం

పట్టణంలో బ్రాహ్మణ సామాజకవర్గ ఓటర్లు 8 వేలమంది ఉన్నారు. గతంలో 12వ వార్డులో వీరి సంఖ్య కొంచెం హెచ్చుగా ఉండేది. పునర్విభజనలో 20వ వార్డుగా మారింది. దాదాపు మూడు వేల ఓటర్లలో బ్రాహ్మణ సామాజికవర్గ ఓటర్లు 1400 పైగా ఉన్నారు. అందుచేత ఆ వార్డు నుంచి టీడీపీ తరఫున బ్రాహ్మణులకు కేటాయించమని అభ్యర్థించారు. దీనితో టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ భరోసాతో తాడేపల్లి సూర్యనారాయణమూర్తి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకున్నారు. నామినేషను పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. తీరా చూస్తే, ఆ వార్డును జనసేన పార్టీకి చెందిన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడికి కేటాయించారు. నామినేషన్లకు చివరి రోజైన 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు సూర్యనారాయణమూర్తికి కూటమి నాయకులు ‘సారీ’ చెప్పారట! దీనితో మనస్తాపం చెందిన సూర్యనారాయణమూర్తి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఫోన్‌ చేసి, నామినేషనును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇందుకు నిరసనగా సోమవారం ఉదయం టీడీపీకి చెందిన బ్రాహ్మణ సామాజికవర్గ ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటుచేసిన తమ ఆవేదనను వ్యక్తంచేశారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఒక్క సీటు ఇవ్వకపోవటాన్ని ప్రశ్నించారు. పైగా పోటీకి సిద్ధంకమ్మని చెప్పిన మంచి వ్యక్తిని కూడా వద్దని తిరస్కరించటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని చెప్పారు.

ఆత్మగౌరవం పేరుతో ప్రెస్‌మీట్‌

ఇదిలావుంటే, బీజేపీ తరఫున గంగానమ్మపేటలోని వార్డులో పోటీకి ఆ పార్టీలో చురుగ్గా ఉండే తమిరిశ రఘుకు హామీ లభించింది. కూటమి పార్టీల నుంచి ఇచ్చిన హామీతో మూడు నెలలుగా ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల పంపకంలో బీజేపీకి ఆరు సీట్లు ఇస్తామని చెప్పారనీ, తర్వాత మూడు, మళ్లీ రెండు...అంటూ చివరకు ఒకే ఒక సీటు కేటాయించారని చెబుతున్నారు. అదికూడా బీజేపీకి బలం లేని పినపాడులో కేటాయించారట! గంగానమ్మపేటలో సీటు ఇస్తామని చెప్పి, అక్కడ ప్రచారం చేసుకుంటున్న సమీపంలో చివరి నిమిషంలో పినపాడులో కేటాయించటంపైనా బీజేపీలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ పార్టీ నుంచి పలువురు రెబెల్స్‌ నామినేషన్లు దాఖలు చేశారు. దీనిని ఏవిధంగా సర్దుబాటు చేసుకుంటారోగాని, ఈ రెండు అంశాలు పట్టణంలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement