జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
తెనాలిరూరల్: తెనాలి పురపాలక ఎన్నికల కౌంటింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ల ఘట్టం ముగిసి, పరిశీలన దశలో ఉండగా ఆయన స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు కేంద్రంగా ఉన్న జేఎంజే మహిళా కళాశాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలో ఉంచిన ఎన్నికల సామగ్రిని, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ జె. రామ అప్పలనాయుడు నుంచి ఎన్నికల సామగ్రి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా లెక్కింపు ప్రక్రియకు కేటాయించిన హాలు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ భద్రత ఏర్పాట్లపై డీఎస్పీ బి.జనార్ధన రావు నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు సమష్టిగా పని చేయాలని ఆదేశించారు. అలాగే ఈనెల 21 నుంచి జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో దానికి సంబంధించి నన్నపనేని వెంకటరావు ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా పోలింగ్ ముగిసేందుకు నిర్ణయించిన గడువుకు ముందు ఉండే 48 గంటల కాలంలోను, ఓట్ల లెక్కింపు రోజున సంబంధిత పోలింగ్ పరిధిలోని ప్రాంతాల్లో అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. తెనాలి ఆర్డీఓ కె. శ్రీరమణి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, తెనాలి ఆర్‌ఓ కె.దుర్గాబాయి, తెనాలి డీఎస్పీ బి.జనార్ధన రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..
గుంటూరు వెస్ట్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పిటిసిలకు 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. 24న స్క్రూటినీ, 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు, 26న అప్పీల్లెట్ అధికారి అప్పీల్ పరిష్కారం, 27న ఉపసంహరణలు ఉంటాయన్నారు. నవంబరు 3న పోలింగ్, నవంబరు 5న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్‌ఓ షేక్ ఖాజావలి, వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


