శివారు కాలనీల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలి కూటమి రెండేళ్ల పాలనలో మచ్చుకై నా కానరాని అభివృద్ధి గుంటూరు కార్పొరేషన్‌లో తొలిసారి మేయర్ అభ్యర్థిగా ఆర్యవైశ్యులకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మేయర్ అభ్యర్థి శ్రీదేవితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చిన అంబటి రాంబాబు
గుంటూరు ఎడ్యుకేషన్: ట్రాఫిక్, పారిశుద్ధ్య సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న గుంటూరు నగరాన్ని గాడిలో పెట్టి సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు నాగ వెంకట పద్మ శ్రీదేవి అన్నారు. సోమవారం బందావన్ గార్డెన్స్ లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మేయర్ అభ్యర్థి శ్రీదేవికి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బీ ఫారం ఇచ్చారు. ఈ సందర్భంగా తాడికొండ శ్రీదేవి మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయాలకు కొత్త కాదని, సామాజిక సేవతో కూడిన రాజకీయాల్లో తమకు అపారమైన అనుభవం ఉందన్నారు. గుంటూరు నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆర్యవైశ్యులకు మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్యవైశ్యులకు రాజకీయంగా గౌరవాన్ని కల్పించడంతోపాటు సముచితమైన గుర్తింపు ఇచ్చారన్నారు. ప్రజాభిమానంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధిపై దృష్టి..
గుంటూరు నగర శివారుల కాలనీల్లో మౌలిక వస్తువుల కొరత తీవ్రంగా ఉందని, ప్రణాళిక బద్ధంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. నగరాన్ని పట్టిపీడిస్తున్న పీకల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో నగరంలో అభివృద్ధి జాడలు మచ్చుకై నా లేవని, నగరాన్ని ట్రాఫిక్ చక్రబంధంలోకి తీసుకెళ్లారన్నారు. ఏ ప్రాంతంలో చూసినా పారిశుద్ధ్య సమస్య తాండవం చేస్తోందని, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. రూ.450 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులు అసంపూర్తిగా ఉన్నాయని, తాను మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తానని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరు కార్పొరేషన్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టీఎల్వీ వీరాంజనేయులు, పార్టీ నాయకులు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


