భద్రాచలంఅర్బన్: ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు శ్రీరాముడిని తలుచుకోవడాన్ని హిందువులు ఆనవాయితీగా పాటిస్తారు. అదే భావనతో తన సోషల్ మీడియా ఖాతాలకు ‘రామ్ ది ట్రావెలర్’ అని పేరు పెట్టుకున్న ఏపీలోని గుంటూరు ఆర్‌టీసీ కాలనీకి చెందిన దుర్గారావు కొత్త ప్రాంతాలను చూడాలనే ఆసక్తితో విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఎనిమిదో తరగతితో చదువు ఆగిపోయిన దుర్గారావు 2023లో ప్రయాణాలు మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 30 దేశాల్లో పర్యటించిన ఆయన, అందులో 11 దేశాలను సైకిల్‌పై చుట్టిరావడం విశేషం. ప్రపంచంలోని 195 దేశాలను చూడాలని లక్ష్యంగా పెట్టుకోగా విజయవాడ నుంచి సైకిల్‌పై సోమవారం భద్రాచలం చేరుకున్నాడు. గతంలోనూ బంగ్లాదేశ్, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, సింగపూర్, నేపాల్, కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా దేశాల్లో సైకిల్‌పై పర్యటించినట్లు దుర్గారావు వివరించాడు. వివిధ దేశాల జీవన విధానం, ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకే పర్యటనలు చేస్తున్నానని తెలిపారు. గతేడాది నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తన మోకాలికి గాయం కాగా, ఆతర్వాత కూడా పలు దేశాల్లో పర్యటించానని వెల్లడించాడు.
సోషల్ మీడియాలో లక్షలాది మంది ఆదరణ
దుర్గారావు తన ప్రయాణ విశేషాలను ‘రామ్ ది ట్రావెలర్’ పేరుతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో 2.98 లక్షలు, ఫేస్‌బుక్‌లో 2.76 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, యూట్యూబ్‌లో 12.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని తెలిపారు.


