వైఎస్సార్ సీపీ వారైతే ఒకలా.. అధికార పార్టీ వారికి మరోలా వైఖరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని వైనం
వైఎస్సార్ సీపీ అభ్యర్థులపైనే ఆంక్షలా?
పట్నంబజారు: గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల నిబంధనలను అమలు చేసే విషయంలో అధికార పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఒక రకంగా, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అభ్యర్థుల పట్ల మరో రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పలు ఆంక్షలు విధించారు. టీడీపీ అభ్యర్థుల విషయంలో మాత్రం అదే స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు. ఈ వ్యవహారం ఎన్నికల నిర్వహణలో పోలీసుల నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏదైనా మాట్లాడితే చాలు, బైండోవర్ కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ కేవలం వైఎస్సార్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రచార సమయంలోనూ..
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. సుమారు ఆరు రోజులపాటు కొనసాగే ప్రచార సమయంలోనూ పోలీసులు తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బైండోవర్ల పేరుతో పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురిని అక్రమంగా బైండోవర్ చేశారు. గత ఎన్నికల సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలపై ఎందుకు బైండోవర్ చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనితోపాటు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం మరో ఆరుగురిని ఆదివారం బైండోవర్ చేశారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో తప్పులేదని, అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని కేవలం ఒకరిపైనే ప్రయోగించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ బాధ్యత పోలీసులదే...
ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. ఓటర్లు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. ప్రచార అనుమతులు, జనసమీకరణ, ధ్వని కాలుష్యం, బాణసంచా వినియోగం వంటి అంశాల్లో నిబంధనలను అన్ని పార్టీలకూ ఒకే విధంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు పోలీసులు పలు సూచనలు, ఆంక్షలు విధించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్లకు వచ్చేటప్పుడు డీజేలు, దాండియా కార్యక్రమాలు నిర్వహించకూడదని, బాణసంచా కాల్చకూడదని, ర్యాలీలో 30 మందికి మించి ఉండకూడదని చెబుతున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నిబంధనలు అమలు చేయడం అవసరమే అయినప్పటికీ, ఆ నిబంధనలను అన్ని పార్టీల అభ్యర్థులకు సమానంగా వర్తింపజేయాలి. పోలీసులు మాత్రం టీడీపీ నేతలను వదిలేసి కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేశారు.


