దుర్గాదేవిగా భ్రమరాంబ దర్శనం | - | Sakshi
Sakshi News home page

దుర్గాదేవిగా భ్రమరాంబ దర్శనం

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు ఆదివారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెదకాకాని శివాలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు ప్రాతఃకాల అర్చన, అభిషేకం, పంచహారతుల క్రతువును నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనాలు, పంచగవ్య ప్రాశనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నవావరణార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పలువురు భక్తులు ఆలయ యాగశాలలో చండీ, రుద్ర హోమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల కాలక్షేపం కోసం రాత్రి వేళల్లో వెనిగండ్ల ఉల్లంగుల వెంకటసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భజన, గుంటూరు అను డాన్స్‌ అకాడమీకి చెందిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. తెనాలి ఆదినారాయణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శ్రీకృష్ణ తులాభారం పౌరాణిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివాలయంలో సోమవారం భ్రమరాంబ అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఉపకమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. విజయదశమి రోజైన మంగళవారం అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలందుకుంటారని పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం పూర్ణాహుతి, సాయంత్రం శమీపూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం గ్రామోత్సవం జరుగుతుందని, భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement