కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థిని గెలిపించాలి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి పాలనలో గుంటూరు నగరాన్ని సర్వనాశనం చేశారని, ట్రాఫిక్ ఇబ్బందులతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ... కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అహంభావంతో, ముందు చూపు లేకుండా శంకర్‌విలాస్ బ్రిడ్జిని కూలగొట్టించారని ఆరోపించారు. భవిష్యత్తు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెగా ఫ్లయ్ ఓవర్ నిర్మించాల్సిన చోట కేంద్రం నుంచి తెచ్చిన రూ.98 కోట్లతో సాధారణ బ్రిడ్జి నిర్మిస్తున్నారని అన్నారు. వ్యాపారస్తులను బెదిరించి ఏకపక్షంగా బ్రిడ్జిని కూల్చివేశారన్నారు. గతంలో టీడీపీ పాలనలోనే రూ.174 కోట్లతో లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల కూడలి వరకు మెగా ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి తయారు చేసిన నివేదికను బుట్టదాఖలు చేశారని అన్నారు. రాజధానిలో నిర్మాణాలకు రూ. వేల కోట్లు తగలేస్తున్న సీఎం చంద్రబాబు దీనికి మాత్రం రూ.వంద కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కిందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టీఎల్‌వీ వీరాంజనేయులు, శ్రీదేవి దంపతులు వ్యాపారంతోపాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. హామీల అమల్లో కూటమి విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి మోసం చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రచారం చేస్తామని చెప్పారు. మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, టీఎల్‌వీ వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో గుంటూరులో రౌడీయిజం పెరిగిపోయిందని, పోలీసుల అండతో టీడీపీ అల్లరి మూకలు పేట్రేగిపోతున్నాయని అంబటి ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరులో రౌడీయిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పల్నాడు, రాయలసీమలో టీడీపీ అరాచకాలు చేస్తూ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో గుంటూరును అన్ని రంగాల్లో అభివృద్థిఽ చేశామని, ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికలపై వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.


