గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు అవసరమయ్యే అనుమతుల కోసం ప్రతి మండలంలో సింగిల్ డెస్క్ పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేయకపోతే తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ, తెనాలి పురపాలక సంఘంలోనూ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలన్నారు. ఎస్.ఎస్.టి. బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు చురుగ్గా పనిచేయాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు పట్ల స్పష్టత కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది, లెక్కింపు సిబ్బంది నియామకాలు వెంటనే పూర్తి చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్ పరిశీలకులు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉన్నా 08632 234014 హెల్ప్‌డెస్క్/కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌ను ప్రజలు సంప్రదించవచ్చని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల
నామినేషన్ల స్వీకరణకు సిద్ధం కావాలి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు సిద్ధం కావాలని కలెక్టర్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు, రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన అధికారులతో ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీసీ కెమెరాలను సోమవారం సాయంత్రం నాటికి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వచ్చే అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 19వ తేదీన షెడ్యూలు ప్రకటించనుందని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు 21వ తేదీన తమ పరిధిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టాలన్నారు.
పీజీఆర్‌ఎస్ తాత్కాలికంగా రద్దు
ప్రతి సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను ఎన్నికల కోడ్ దృష్ట్యా నిలిపివేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయం తెలియజేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ ిసీఎం సాయికాంత్ వర్మ


