విజయకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

విజయకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు

Oct 19 2026 7:18 AM | Updated on Oct 19 2026 7:18 AM

విజయకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు కోటప్పకొండలో భవ్య హాసిని నాట్య నీరాజనం దుర్గాదేవిగా బాల చాముండేశ్వరి

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాజ్యలక్ష్మి అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకీసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు.

నరసరావుపేటరూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి నెల్లూరుకు చెందిన భవ్య హాసిని నాట్య నీరాజనం సమర్పించారు. సనాతన ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆమె నాట్య నీరాజనం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కోటప్పకొండ కింద నుంచి ఘాట్‌రోడ్డు ద్వారా భరతనాట్యం చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. ప్రకృతి అందాలు, పురాణగాఽథలు, ప్రాచీన చరిత్ర, మహాశివరాత్రి ప్రభల తిరునాళ్లతో పుణ్యక్షేత్రం ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. అంతటి పుణ్యక్షేత్రంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు నృత్యం చేయడం ఆనందంగా ఉందని భవ్య హాసిని తెలిపారు. అరుణాచలం, ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ, దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వరకు నృత్య నీరాజనం చేసినట్టు పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే భరత నాట్యం ద్వారా సనాతన ధర్మంపై అవగాహన కల్పిస్తున్న భవ్య హాసినిని పలువురు భక్తులు అభినందించారు.

అమరావతి: శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతిలోని బాల చాముండిక సమేత అమరేశ్వర ఆలయంలో ఆదివారం బాలచాముండేశ్వరి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారు భక్తుల పూజలు అందుకున్నారు. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, దేవీఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీచక్రార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్ధని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని ఉపాలయం వద్ద దుర్గా, చండీ, రుద్రహోమాలు నిర్వహించారు.

24న ఫొటోతో కూడిన ఓటరు జాబితా

నరసరావుపేట: కోర్టు కేసుల కారణంగా వాయిదా పడిన నరసరావుపేట మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు చెందిన ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఫొటోలతో ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనీల్‌ చంద్ర పునేఠ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నగరపాలక, మున్సిపాలిటీలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 28న జరుగనుండగా, 30న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. అయితే రెండో దశ ఎన్నికలు జరిగేవరకు ఫలితాల ప్రకటన వాయిదా పడతుందా? లేదా? అనే అంశంపై క్లారిటీ రాలేదు. నరసరావుపేట పురపాలక సంఘంలో జనవరి నెల వరకు ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రక్రియకు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు సుమారు 1,07, 274 మంది ఓటర్లు ఉన్నారు. వార్డులను 48కు పెంచుతూ విభజన ప్రక్రియ ఆమోదం కోరుతూ ఇప్పటికే సీడీఎంఏ అధికారులకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement