టీడీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

టీడీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

సహకరించబోమన్న సీనియర్లు

ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పార్టీ కోసం పనిచేయాలా అని నిలదీత 2029 ఎన్నికల కోసం తాము కూడా వేచి చూస్తామని వెల్లడి తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు సీనియర్ల హెచ్చరిక

పట్నంబజారు: ‘‘ఎన్నికల్లో మమ్మల్ని వాడుకుని, నమ్మించి మోసం చేశారు. మాకు సీట్లు కేటాయిస్తామని చెప్పారు. రిజర్వేషన్లు మారిన నేపథ్యంలో కనీసం పార్టీ కోసం కష్టపడిన వారికి కూడా సీట్లు కేటాయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాగైతే మేం కూడా పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం సహకరించలేమని’’ తెలుగుదేశం పార్టీ నేతలు... తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు స్పష్టం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల కేటాయింపులో విసిగిపోయిన టీడీపీ క్యాడర్‌.. ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తున్న అభ్యర్థులకు ఏమాత్రం సహకారం అందించలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే కచ్చితంగా వారిని ఓడించేందుకు కృషి చేయాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యవహారశైలి టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే ఎంతో మంది నుంచి బయోడేటాలు తీసుకున్న ఆయన, అభ్యర్థుల కేటాయింపులో తాత్సారం చేస్తున్నారని, కేవలం తనకు వ్యక్తిగతంగా సహకరించిన వారి పేర్లను మాత్రమే ప్రతిపాదిస్తున్నారని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటివరకు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు సంబంధించి సీట్ల కేటాయింపులో సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ఎంతో మందికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్‌ సీట్ల కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ వద్దకు వెళ్లిన కొంతమంది టీడీపీ నేతలు, 2029 ఎన్నికల కోసం తాము కూడా వేచి చూస్తున్నామని, తామేంటో చూపిస్తామని ఎమ్మెల్యే కార్యాలయంలోనే ప్రత్యక్షంగా హెచ్చరించినట్లు సమాచారం

మరో వర్గం భేటీ...?

ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు వ్యతిరేకంగా ఉన్న మరికొంతమంది నేతలతో కలిసి, టీడీపీలో కార్పొరేటర్‌ సీట్లు ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్‌ నేతలు భేటీ అయినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును ఆశించిన ఒక టీడీపీ కుటుంబం.. తమ సోదరుడికి ఒకటో డివిజన్‌ సీటు అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బయోడేటా తీసుకుని వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పాటు, ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన నేత చేసిన సిఫార్సులను కూడా ఏమాత్రం లెక్కచేయడం లేదని, ఆయన మనుషులని తెలిస్తే సీటు లేదని చెబుతున్న పరిస్థితులు టీడీపీ నేతలకు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేకు, ఈ నేతలకు ఏమాత్రం పొసగదన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ క్రమంలో ఆ ఇద్దరు ముఖ్య నేతల్లో ఒకరు, మరో ముఖ్య నేత కుటుంబ సభ్యులు, కనీస గౌరవం కూడా దక్కని సీనియర్‌ టీడీపీ నేతలు అంతా భేటీ అయినట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరును స్థానికంగా ఉన్న కేంద్ర సహాయ మంత్రి, పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని వారు యోచిస్తున్నారు. నామినేషన్లకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటికే సీనియర్లు టీడీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement