నెల రోజులకే ఒకపక్క కుంగిన రోడ్డు రూ.3.50 కోట్లు పెట్టినా ధ్వంసం అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కుపై సందేహాలు
ప్రత్తిపాడు: ‘‘దాదాపు 20 రోజుల కిందట పడిన వర్షాలకు కొత్త రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పెద్ద వర్షాల వల్ల రోడ్డు ఇంకా సెట్ అవ్వలేదు. కింద నేల మెతకగా ఉంటే రోడ్డు ఇలాగే కుంగిపోతుంది. అందుకే నెల కూడా అవ్వకుండానే రోడ్డు కుంగిపోయింది. అయినా ఇప్పుడు బయటపడటమే మంచిదైంది. కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ చేసే గడువు ఉంటుంది. ఆ సమయంలో వాళ్లే మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. చేయిస్తాం.’’... ఇదీ వట్టిచెరుకూరు మండల ఆర్ అండ్ బీ ఏఈ వాదన. ఈ ‘మెతక’ మాటలు ఇంజినీరింగ్ అధికారుల డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. పనితీరుపై సందేహాలను పెంచుతున్నాయి. కోట్ల రూపాయలు కరిగిపోయాయి. నెల రోజులు కూడా తిరక్కుండానే కొత్త రోడ్డు కుంగిపోయింది. వట్టిచెరుకూరు–ముట్లూరు రహదారి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. వట్టిచెరుకూరు మండలంలో ఎండీఆర్ ప్లాన్ కింద వట్టిచెరుకూరు–ముట్లూరు రోడ్డును సుమారు పది కిలోమీటర్ల మేర రూ.3.50 కోట్లతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఇంకా పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలోనే నిర్మాణంలోని లోపాలు బయటపడ్డాయి. ఇటీవల కురిసిన అతి కొద్దిపాటి వర్షాలకే రోడ్డు కుంగిపోయి అటు కాంట్రాక్టర్, ఇటు ఇంజినీరింగ్ అధికారుల బాగోతాన్ని వెక్కిరిస్తోంది.
నాణ్యతపై అనుమానాలు..
రహదారి నాణ్యతపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, పనులు చేసిన విధానం, రోడ్డు కాంపాక్షన్ తదితర అంశాలపై సందేహాలు తలెత్తుతున్నాయి. రూ.3.50 కోట్ల ప్రజాధనంతో చేపట్టిన ఈ పనులు ఎక్కువకాలం మన్నికగా ఉండేలా గుత్తేదారు నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణానికి ముందు బేస్ సిద్ధం చేయడం నుంచి మెటీరియల్ మిశ్రమం, కాంపాక్షన్, తారు పొరల వరకు ప్రతి దశలో నిర్ణీత నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా పాటిస్తున్నారా లేదా అన్నది ఆర్ అండ్ బీ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలి. కానీ, పర్యవేక్షణ కరువవడంతో రోడ్డు ఇలా కుంగిపోయి ఇంజినీరింగ్ శాఖ ఉదాసీనతను వెక్కిరిస్తోంది. కుంగుబాటుకు గల కారణాలను అక్కడక్కడా గుంతలు తవ్వి ౖపైపెన పరిశీలించి చేతులు దులిపేసుకోకుండా, సాంకేతిక నిపుణులు, జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరీక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై వట్టిచెరుకూరు ఆర్ అండ్ బీ ఏఈ ఎస్.కె.ఏ. కెనడీని ‘సాక్షి’ వివరణ కోరగా, గుత్తేదారుతో మెయింటెనెన్స్ కింద మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. నేల మెతకగా ఉండటం వల్ల రోడ్డు నెల తిరగకుండానే కుంగిపోయిందని తెలిపారు.


