ఆర్యవైశ్యులకు గౌరవం కల్పించిన వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులకు గౌరవం కల్పించిన వైఎస్‌ జగన్‌

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి శ్రీదేవి నామినేషన్‌ దాఖలు ప్రజాభిమానంతో మేయర్‌గా విజయం సాధిస్తానని వెల్లడి

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు నగర మేయర్‌ స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మ శ్రీదేవి శనివారం నామినేషన్‌ వేశారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని నగరపాలక సంస్థ సర్కిల్‌ కార్యాలయంలో ఆమె రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అనంతరం శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్‌ సీపీలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ అందించిన సంక్షేమ పాలన, గుంటూరు నగర అభివృద్ధికి చేసిన కృషి తనను మేయర్‌గా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాభిమానంతో మేయర్‌గా విజయం సాధిస్తానని అన్నారు. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజాభిమానం మెండుగా ఉన్నందున ధైర్యంగా పోటీలో నిలిచినట్లు చెప్పారు. ఆమె వెంట వైఎస్సార్‌ సీపీ నేత, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు టీఎల్‌వీ వీరాంజనేయులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.

పార్టీలో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం

పార్టీలో ఆర్యవైశ్యులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారవేత్తలుగా సమాజ ఆర్థికాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ, భక్తిభావం మెండుగా ఉన్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి పార్టీలో తగిన గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో తాడికొండ శ్రీదేవిని వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు నగర మేయర్‌ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా నియమితులైన టీఎల్‌వీ వీరాంజనేయులు సతీమణి అయిన శ్రీదేవికి సమాజంపై చక్కటి అవగాహన ఉందని అన్నారు. ఆర్యవైశ్యులను గౌరవించాలనే ఉద్దేశంతో తాడికొండ శ్రీదేవిని గుంటూరు మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారని, ఆర్యవైశ్య మహిళను మేయర్‌గా గెలిపించుకుంటామని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీతో కూడిన కూటమి నేతలు అభ్యర్థుల ఎంపికలో తలలు పట్టుకుంటున్నారని, వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను అధినేత వైఎస్‌ జగన్‌ ధైర్యంగా ప్రకటించారని అంబటి రాంబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement