వైభవంగా శ్రీదేవీ నవరాత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీదేవీ నవరాత్రోత్సవాలు

Oct 18 2026 2:24 AM | Updated on Oct 18 2026 2:24 AM

లలితా త్రిపురసుందరీదేవిగా భ్రమరాంబ దర్శనం

పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో అమ్మవారు లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులను శనివారం అనుగ్రహించారు. శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ, హారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేదపండితులు, స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు పర్యవేక్షణలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నవావరణార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపించారు. ఆలయ యాగశాలలో నిర్వహించిన చండీ, రుద్ర హోమ పూజల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాప్రసాద్‌ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు ప్రవచనకర్త నోరి నారాయణమూర్తి దేవీభాగవతంపై ప్రవచనం చేశారు. విజయవాడ శ్రీ నృత్య కళానిలయం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, గుంటూరు శ్రీ శ్రీనివాస చైతన్య నాట్య కళామండలి వారిచే సత్యహరిశ్చంద్ర నాటకంలోని అడవి సీను, వారణాసి, కాటి సీన్లను అద్భుతంగా ప్రదర్శించారు. ఆదివారం భ్రమరాంబ అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించనున్నట్లు ఉపకమిషనర్‌ తెలిపారు. రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement