గుంటూరు లీగల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని శిశు గృహానికి రిఫ్రిజిరేటర్, స్టోరేజ్ బాటిల్, వాటర్ బాటిల్స్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పి.వి.రాజీవ్‌లు శనివారం మేనేజర్ ఒలీవ చంద్రికకు అందజేశారు. ఓ కేసులో రూ.30 వేలను గుంటూరు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మొత్తాన్ని పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని ఆదేశించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, సిబ్బంది, శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు, ఎన్నికలకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసేందుకు స్థానిక కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 08632 234014 నంబర్‌ను సంప్రదించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివిధ చానల్స్, కేబుల్ చానెల్, సినిమా హాల్ తదితర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి అభ్యర్థులు మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ టీమ్‌కు కనీసం మూడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. శనివారం స్థానిక ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్‌తో కలసి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విధులకు సంబంధించి సిబ్బంది తమ సందేహాలను శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఎన్నికల మెటీరియల్‌ను క్షుణ్ణంగా చదివి, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అశ్రద్ధకు తావులేకుండా, నిబంధనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సిబ్బంది శిక్షణా తరగతులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ధైర్యలక్ష్మి అమ్మవారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ధైర్యలక్ష్మి అమ్మవారికి ఉదయం అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ధైర్యలక్ష్మి అమ్మవారికి శ్రీయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ఽధైర్యలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధైర్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కష్టాలను ఎదుర్కొనే శక్తి, కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని ధైర్యలక్ష్మి అమ్మవారిని పూజిస్తారని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు అన్నారు.


