కాలుష్య రహిత జిన్నింగ్‌తోనే పత్తి పరిశ్రమకు మేలు | - | Sakshi
Sakshi News home page

కాలుష్య రహిత జిన్నింగ్‌తోనే పత్తి పరిశ్రమకు మేలు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

కాలుష్య రహిత జిన్నింగ్‌తోనే పత్తి పరిశ్రమకు మేలు అనధికార గోడౌన్‌లో గడ్డి మందులు స్వాధీనం మాదకద్రవ్యాల తయారీ కేసులో ముగ్గురికి 15 ఏళ్ల జైలు

–నేడు గుంటూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం

కొరిటెపాడు(గుంటూరు): పత్తి జిన్నింగ్‌ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ, టీఎంసీ యూనిట్ల పరిరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ కాటన్‌ టీఎంసీ కన్సార్టియం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ కాటన్‌ టీఎంసీ జిన్నింగ్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉప్పుటూరి సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ కాటన్‌ టీఎంసీ కన్సార్టియం కార్యవర్గం, సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం కాలుష్య రహిత జిన్నింగ్‌ విధానాలు, పత్తి రైతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబతులు సాధించే మార్గాలు, ఆధునిక సాంకేతికతపై చర్చించనున్నట్లు తెలిపారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)తో పాటు టీఎంసీ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఏటుకూరు బైపాస్‌ రోడ్డులోని వివాహ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, వీవింగ్‌, పత్తి గింజల క్రషింగ్‌ రంగాల ప్రతినిధులు, వ్యాపారులు, రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కొరిటెపాడు(గుంటూరు): పట్నంబజారులోని విజయ శానిటరీ సీడ్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ దుకాణదారునికి చెందిన ఏటుకూరు రోడ్డులోని అనధికార గోదాములో సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన, ఆంధ్రప్రదేశ్‌లో వినియోగ నియంత్రణకులోబడి ఉన్న గ్‌లైఫోసేట్‌ గడ్డి మందులను గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులు గురువారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో గ్‌లైఫోసేట్‌ 41 శాతం ఈసీ 160 లీటర్లు దీని విలువ రూ.1,63,522, అమ్మనియం సాల్ట్‌ ఆఫ్‌ గైఫోసేట్‌ 71 శాతం ఎస్‌జీ 17.3 కిలోలు దీని విలువ రూ.26,520 గుర్తించారు. మొత్తం రూ.1,90,042 విలువైన గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నట్లు పురుగుమందుల తనిఖీ అధికారి సుజాత వెల్లడించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పురుగుమందుల తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్‌ డీలర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సరైన పత్రాలు లేకుండా, అనుమతి లేని గోదాముల్లో పురుగుమందులను నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా పురుగుమందుల చట్టం–1968 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున జరిమానా

విశాఖ లీగల్‌: అనుమతులు లేకుండా మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయనాన్ని తయారు చేసిన ముగ్గురికి 15 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఒకటో అదనపు జిల్లా కోర్టు కం ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకట రమణ గురువారం తీర్పు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల చొప్పున సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.ఎన్‌. శ్రీనివాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 జూన్‌ 23న కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) హైదరాబాద్‌ జోన్‌ అధికారులు అందిన సమాచారంతో అచ్యుతాపురం పారిశ్రామికవాడలోని ఓ మందుల తయారీ సంస్థలో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మాదకద్రవ్యాల తయారీలో ఉపయోగించే రసాయనాన్ని తయారు చేస్తున్న ముగ్గురిని గుర్తించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు (47), నల్లగొండకు చెందిన ఎరుకుల యాదయ్య (30), కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన గోనెపల్లి నాగరాజు (27)ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 119.50 కిలోల రసాయన ద్రావణంతో పాటు మరో రసాయన పదార్థం ఉన్న ఎనిమిది డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన కాల్వాయి మనోహర్‌రెడ్డి (43) ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో నలుగురిపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 29 కింద కేసు నమోదు చేశారు. మనోహర్‌రెడ్డి పరారీలో ఉండటంతో అతనిపై కేసు పెండింగ్‌లో ఉంది. మిగిలిన ముగ్గురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. విశాఖ పరిధిలో మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే రసాయనాల వ్యవహారంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్‌సీబీ అధికారులు నేరుగా దర్యాప్తు చేపట్టడంతో స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement