గుంటూరు వెస్ట్: చిన్న చిన్న సమస్యలకు సైతం కలెక్టరేట్‌కు వస్తున్నారని క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించే విధంగా సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 254 అర్జీలను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డెప్యూటీ కలెక్టర్ గంగరాజు, డ్వామా పీడీ శంకర్, జిల్లా అధికారులు పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


